ఈడిగ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి | Sakshi
Sakshi News home page

ఈడిగ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

Published Sun, Mar 5 2017 9:23 AM

ఈడిగ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

► అన్ని రంగాల్లో వెనుకబడ్డాం
► అందరూ సంఘటితం కావాలి
పీలేరు: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్‌ తరహాలో ప్రత్యేకంగా ఈడిగ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని సినీ హీరో సుమన్‌ అన్నారు. శనివారం పీలేరు పట్టణ శివారు ప్రాంతంలోని శ్రీవెంకటేశ్వర కల్యాణ మండపంలో శనివారం ఈడిగ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన సుమన్‌ మాట్లాడుతూ ఈడిగ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని తెలిపారు. ప్రభుత్వాలు వారి ఉన్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విద్య, వైద్యం, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబడ్డామని, పురోభివృద్ధికి అంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను విధిగా చదివించాలని సూచించారు. ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిరుపేదలకు రుణాలు అందించాలని కోరారు. నిరుపేద ఈడిగ కులస్తులకు ఇండ్లు, రేషన్‌ కార్డులు, ప్రభుత్వ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. చదువులో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలబడుతామని చెప్పారు. అనంతరం సుమన్‌ను ఘనంగా సన్మానించారు. సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంచినీళ్ల శివప్రసాద్, నాయకులు నాగరాజ, కృష్ణమూర్తి, పురం రామమూర్తి, ఆంజనేయులు, నాగభూషణం పాల్గొన్నారు.

Advertisement
Advertisement