కనరో భాగ్యము.. | Sakshi
Sakshi News home page

కనరో భాగ్యము..

Published Fri, Jul 25 2014 12:44 AM

కనరో భాగ్యము.. - Sakshi

బ్రహ్మ కడిగిన పాదము.. బ్రహ్మము
తానైన పాదము.. శ్రీహరి దర్శనమే మహా భాగ్యం. సేవలలో పాల్గొనడం మహదానందం. విశాఖ నగరమే స్వర్ణభారతికి తరలివచ్చిందా.. అన్నట్టు సుప్రభాతం పలికేందుకు తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి ఏకాంత సేవ ముగిసేవరకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వేంకటేశుని వైభవాన్ని తిలకించి పరవశించిపోతున్నారు. మాటలకందని మధురానుభూ తికి లోనై అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. గురువారం తిరుప్పావడ సేవను అర్చక స్వాములు కనుల పండువగా నిర్వహించారు.
 
వారాంతపు సేవల్లో ఎంతో విశిష్టమైనది తిరుప్పావడ సేవ. తిరుమలలో ప్రతి గురువారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రెండవ అర్చనానంతరం జరిగే సేవ ఇది. వేంకటేశుని మూలవిరాట్టుకు ఉన్న ఆభరణాలన్నింటినీ తొలగించి, నొసటి నామాన్ని తగ్గించి నేత్రాలు స్పష్టంగా భక్తులకు కనిపించేవిధంగా చేశారు. అనంతరం స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందు ఏడుకొండల ఆకారంలో పులిహోరని రాశిగా ఏర్పాటు చేశారు. జిలేబీలను మురుకులను చక్కగా అమర్చి పూలతో అలంకరించారు. పులిహోర రాశిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. నివేదించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. స్వామివారి నేత్ర దర్శనంతో భక్తులు పులకించిపోయారు. చల్లని చూపుతో అందరినీ అనుగ్రహించేలా  లోకలను ఏలే స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. గోవిందుని నేత్ర దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. స్వామివారి నిజరూప దర్శనంతో పరవశించిపోయారు.
 
 భక్తుల ఆనంద తాండవం


 రెండో రోజు కూడా నిత్య సేవల్లో వేలాదిమంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో మొదలై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ వరకు ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్యానంతో సాగిన శ్రీవారి సేవలను భక్తులు తన్మయత్మంతో తిలకించారు. ఇంకా తోమలసేవ, అర్చన, సహస్రదీపాలంకరణ, వీధి ఉత్సవం నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా నుంచి వచ్చిన భక్తులు గోవిందా.. గోవిందా అంటూ నృత్యాలు చేశారు. స్టేడియం భక్తులతో నిండిపోవడంతో బయట ఆవరణలో స్క్రీన్‌ల వద్ద నిలుచొని అనేకమంది భక్తులు పూజలను తిలకించారు. టీటీడీ అధ్యాత్మిక పుస్తక ప్రదర్శన వద్ద సైతం అధిక సంఖ్యలో సందర్శకులు కనిపించారు. ఆరోగ్య శిబిరం సేవలను అనేకమంది వినియోగించుకున్నారు.
 
 నేటి సేవ
 అభిషేకం
 శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే అభిషేకాన్ని శుక్రవారాభిషేకం అంటారు. ఈ సేవ 614వ సంవత్సరం పూర్వం నుంచే జరుగుతుందని అంచనా. భాగవద్రామానుజుల వారు స్వామివారి వక్ష స్థలంలో బంగారు ఆలివేలు మంగ ప్రతిమను అలంకరింప చేసింది శుక్రవారం కావడంతో అప్పటి నుంచి ఈ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారు. శ్రీనివాసుని యధాతథమైన రూపాన్ని వక్ష స్ధల లక్ష్మీతో సహా ఈ అభిషేక సమయంలో మాత్రమే దర్శించుకునేందుకు వీలవుతుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement