గుడ్డి దర్బార్ | Sakshi
Sakshi News home page

గుడ్డి దర్బార్

Published Tue, Jun 17 2014 1:35 AM

గుడ్డి దర్బార్ - Sakshi

కర్నూలు(కలెక్టరేట్): రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు గడిచినా ప్రజాదర్బార్ వినతుల్లో అధిక శాతం పరిష్కారానికి నోచుకోని పరిస్థితి. జిల్లా కేంద్రంలో స్వయంగా కలెక్టర్ బాధితుల గోడు విని పరిష్కారానికి సిఫారసు చేస్తున్నా కింది స్థాయిలో నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. ప్రతి వారం నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చిన సమస్యలే 30 శాతం వరకు మళ్లీ వస్తుండటమే అందుకు నిదర్శనం. ఒక్క రెవెన్యూ శాఖకు చెందినవే 11,352 వినతులు పరిష్కారానికి నోచుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో 8,716 వినతులను డిస్పోజల్ (పరిష్కారం) చేసినట్లు చూపుతున్నా.. 80 శాతం సమస్యలు ఎక్కడికక్కడే ఉండటం గమనార్హం.
 
 జిల్లా కలెక్టర్ తనకు వచ్చిన వినతులను పరిష్కారం నిమిత్తం ఎండార్స్‌మెంట్ రాసి సంబంధిత అధికారికి రెఫర్ చేస్తారు. ఆయన తన కింది స్థాయి అధికారికి పంపి డిస్పోజల్ చేసినట్లు చూపడం పరిపాటిగా మారింది. బాధితులు మాత్రం అదే వినతితో ప్రతి వారం ప్రజాదర్బార్ గడప తొక్కాల్సి వస్తోంది. ప్రజాదర్బార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 33,507 వినతులు అందగా.. 30,007(90 శాతం) పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. పరిష్కారం ఈ స్థాయిలో ఉంటే ప్రజాదర్బార్‌కు బాధితులు పదేపదే ఎందుకు వస్తున్నారనేది వేయి డాలర్ల ప్రశ్న. జిల్లా పరిపాలనకు అధిపతి అయిన కలెక్టర్‌కు నేరుగా వినతులు అందిస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం వల్ల ప్రజాదర్బార్‌పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.
 
 ఆదోని, ప్యాపిలి, చాగలమర్రి, ఆత్మకూరు, సంజామల, ఆలూరు ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలంటే బాధితులకు కనీసం రూ.300 ఖర్చు అవుతుంది. ప్రతి వారం ఇలాంటి వారు వందల్లో ఉంటున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినతులు ఇస్తున్నా అధికారులు ఎండార్స్‌మెంట్‌తో సరిపెడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఒక సమస్యతో బాధితుడు మళ్లీ వస్తే అందుకు కారణాలను కలెక్టర్, జేసీలు పరిశీలిస్తే లోపం ఎక్కడుందనే విషయం బయటపడుతుంది. ఈ విషయంపై దృష్టి సారించనంత వరకు బాధితులు ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే.
 
మండలాల్లో కనిపించని గ్రీవెన్స్

ప్రతి సోమవారం మండల స్థాయిలో మండల పరిషత్ కార్యాలయంలో విధిగా ప్రజాదర్బార్ నిర్వహించాల్సి ఉంది. ఇప్పటివరకు మండల పరిషత్ అధ్యక్షులు లేనందున స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాంది. మండలస్థాయి గ్రీవెన్స్‌కు విధిగా స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులు పాల్గొనాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే మండల స్థాయిలో గ్రీవెన్స్ తూతూమంత్రంగా సాగుతోంది. సగం మండలాల్లో ఆ ఊసే కరువైంది. సోమవారం దాదాపు 30 మండలాల్లో ప్రజాదర్బార్ నిర్వహించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం.

Advertisement
Advertisement