ఆస్తులు అన్యాక్రాంతమవుతుంటే  మీరేం చేస్తున్నారు? 

10 Jul, 2019 08:38 IST|Sakshi
ఉర్దూ యూనివర్సిటీలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజాద్‌బాష, చిత్రంలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ తదితరులు

కమిటీ సభ్యులు, అధికారులపై డిప్యూటీ సీఎం అంజాద్‌బాష సీరియస్‌ 

ఉర్దూ వర్సిటీలో అవినీతిపై విచారణ చేయిస్తామని వెల్లడి  

నగరంలో విస్తృత పర్యటన 

కర్నూలు : జిల్లాలో వక్ఫ్‌బోర్డు ఆస్తులు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారంటూ  బోర్డు కమిటీ సభ్యులు, అధికారులపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి ఎస్‌బీ అంజాద్‌బాష సీరియస్‌ అయ్యారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన ఆయన స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీడియాతోనూ మాట్లాడారు. స్థానిక మహ్మదీయ వక్ఫ్‌ కాంప్లెక్స్‌ కార్యాలయంలో బోర్డు కమిటీ సభ్యులు, అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా వక్ఫ్‌బోర్డు భూములు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయని, అన్యాక్రాంతమైన భూములు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని ఆవేదన  వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన వార్షిక నివేదిక వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆక్రమణకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకుని కమ్యూనిటీ ప్రయోజనం కోసం ఉపయోగిస్తామన్నారు. పెళ్లికానుక పథకాన్ని వైఎస్‌ఆర్‌ దుల్హన్‌ పథకంగా మార్పుచేసి,  పేద వధువులకు వారి పేరిట కాకుండా  తల్లిదండ్రుల పేరిట చెక్కు పంపించే ఆలోచన చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా రూ. 50 వేలు ఆర్థిక సాయం వస్తే అందులో దళారులకే రూ. 20 వేల దాకా ఖర్చయ్యేదని, కానీ నేడు నయాపైసా తగ్గకుండా రూ. లక్ష అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మస్తాన్‌వలి, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ షబ్బర్‌బాష తదితరులు పాల్గొన్నారు.

 ఉర్దూ వర్సిటీలో అవినీతిపై విచారణ  

 కర్నూలులోని డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్‌బాష స్పష్టం చేశారు. వర్సిటీకి వచ్చిన ఆయన దృష్టికి వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ముజఫర్‌ అలీ, కాంట్రాక్ట్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీ, విద్యార్థి సంఘాల నేతలు, వర్సిటీ విద్యార్థులు పలు సమస్యలను తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న వర్సిటీ అద్దె భవనాల్లో కొనసాగడం బాధాకరమన్నారు. 2016లో వర్సిటీ ఏర్పాటయితే ఇంత వరకు సొంత భవనం నిర్మాణం కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణం ఏ ద«శలో ఉందని అడిగి తెలుసుకున్నారు. నిధులు లేక నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని వీసీ వెల్లడించారు. నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్‌ను మంత్రికి చూపించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే తొలగించారని కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రిజిస్ట్రార్‌ తన భర్తకు పోస్టు ఇప్పించుకోవడానికే  తమను తొలగించారని, రాష్ట్రంలో ఏ వర్సిటీలో లేని విధంగా గెస్ట్‌ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించిన రిజిస్ట్రార్‌ భర్తకు సెమిస్టర్‌కు రూ.1.20 లక్షల చొప్పున చెల్లించారని తెలిపారు. వీసీ ముజఫర్‌ అలీ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాహెదా అక్తర్‌లను కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ సమస్య గురించి మంత్రి  అడగ్గా.. ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు.  దీంతో డిప్యూటీ సీఎం ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్‌ సురేందర్‌రెడ్డి డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.  

ఉస్మానియా కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి 

ఉస్మానియా కళాశాల సమస్యలను ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్‌బాష హామీ ఇచ్చారు. కరస్పాండెంట్‌ అజ్రాజావేద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన హాజిరా కాలేజీకి మున్సిపల్‌ అధికారులు రూ. లక్షల్లో పన్ను విధించారని కరస్పాండెంట్‌ అజ్రాజావేద్‌ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా.. పన్ను మినహాయించేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా కాలేజీ పూర్వవిద్యార్థి అయిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సన్మానం చేయించారు. 
 

ప్రొటోకాల్‌ విస్మరణ 

డిప్యూటీ సీఎం పర్యటన విషయంలో మైనార్టీ సంక్షేమ శాఖ, సమాచార శాఖల అధికారులు ప్రొటోకాల్‌ పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. పాణ్యం నియోజకవర్గ పరిధిలో  ఉర్దూ వర్సిటీ ఉంది. అయితే.. అధికారులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ  సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంజాద్‌ బాష ఉర్దూ వర్సిటీకి ఉదయం 10.30 గంటలకే చేరుకోగా.. ఆయన వచ్చిన 15 నిమిషాల తరువాత సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు నింపాదిగా రావడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.   
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా