గిరిజన హక్కులను కాలరాసిన టీడీపీ | Sakshi
Sakshi News home page

గిరిజనాభివృద్ధిపై చంద్రబాబు లేఖ హాస్యాస్పదం

Published Sat, Jun 20 2020 7:56 PM

Deputy CM Pushpa Srivani Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనాభివృద్ధిని గాలికొదిలేశారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లు గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన నేపథ్యంలో ఆమె శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో టీడీపీ తీరును దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో గిరిజనుల హక్కులను కాలరాసేలా నిర్ణయాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. జీవో నంబర్‌ 3 వీగిపోవడానికి టీడీపీ తప్పిదమే కారణమన్నారు. ఐదేళ్ల పాలనలో గిరిజనుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు.. గిరిజనాభివృద్ధిపై లేఖ రాయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో గిరిజనులు తీవ్ర నిర్లక్ష్యానికి, అవమానాలకు గురయ్యారని, వారి హక్కులను కూడా హరించేలా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగిన ఐదేళ్ల కాలంలో చివరి ఆరు నెలల దాకా కూడా గిరిజనులకు మంత్రి పదవిని ఇవ్వకుండా అవమానించారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గంలో గిరిజన మహిళకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. (అశోక్‌బాబుపై ఏపీఎన్జీవో ఫైర్‌..)

గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారు..
కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గిరిజనాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొనే గిరిజన సలహా మండలి(టీఏసీ)ని ఏర్పాటు చేయాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్ల తర్వాతగానీ టీఏసీని ఏర్పాటు చేయలేదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతల హెచ్చరికలతో టీఏసీని ఏర్పాటు చేసిన టీడీపీ ప్రభుత్వం.. గిరిజన శాసనసభ్యులందరూ వైఎస్సార్‌సీపీకి చెందిన వారు ఉండటంతో వారి హక్కులను కాలరాసేలా, టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా టీఏసీలో సభ్యులుగా చేసిందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే టీఏసీని ఏర్పాటు చేసారని, ప్రభుత్వం ఏర్పాటయిన ఐదు నెలలకే టీఏసీ సమావేశం కూడా జరిగిందని వివరించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను కూడా ఇచ్చిందని చెప్పారు. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల మనోభిప్రాయాలను గౌరవిస్తూ బాక్సైట్ అనుమతులను రద్దు చేసారని వెల్లడించారు. (మరో విప్లవానికి ఏపీ సర్కార్‌ నాంది)

గిరిజనాభివృద్ధిని టీడీపీ పట్టించుకోలేదు..
గిరిజనుల విద్యాభివృద్ధిని, వారి ఆరోగ్య సమస్యలను గురించి టీడీపీ ప్రభుత్వం ఏ రోజు కూడా పట్టించుకోలేదని పుష్ప శ్రీవాణి విమర్శించారు. వైఎస్‌ జగన్‌  అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల విద్యాభివృధ్దిలో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని, గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను, గిరిజన మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడానికి ఆదేశాలను ఇచ్చారని ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో ఏడు ఐటీడీఏలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించడానికి కూడా చర్యలను తీసుకుంటున్నారని వివరించారు. 

ఆ  వర్గాలతో పాటు గిరిజనులకు కూడా అవకాశం..
మునుపెన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంత పంచాయతీల్లో 100 శాతం వార్డులను, జడ్పీటీసీ స్థానాలను గిరిజనులకు రిజర్వ్ చేశారని  ప్రస్తావించారు. మైదాన ప్రాంతాల్లోనూ 100శాతం గిరిజన జనాభా కలిగిన తాండాలలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాలన్నింటినీ కూడా గిరిజనులకే కేటాయించారని గుర్తు చేశారు. 500కు పైబడి జనాభా కలిగిన 146 గ్రామాలను ప్రత్యేక గిరిజన పంచాయితీలుగా మార్చారని, రాష్ట్రంలో 4.76 లక్షల గిరిజన కుటుంబాల గృహావసరాలకు కూడా ఉచిత విద్యుత్తును ఇస్తున్నారని తెలిపారు. నామినేషన్ పనులు, పదవుల్లోనూ ఇస్తున్న 50 శాతం రిజర్వేషన్లలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటుగా గిరిజనులకు కూడా సీఎం జగన్‌ అవకాశం కల్పించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని స్పష్టం చేసారు.

టీడీపీ తప్పిందంతోనే జీవో నంబర్‌ 3 రద్దు..
జీవో నంబర్‌ 3 సుప్రీం కోర్టు కొట్టి వేయడానికి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదమే కారణమని పుష్ప శ్రీవాణి ఆరోపించారు. గతంలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 275 అమల్లో ఉండగా దాన్ని నిర్లక్ష్యం చేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్‌-3 ను తీసుకువచ్చారని, అయితే రాజ్యాగంలో విస్త్తృతమైన అధికారాలు కలిగిన 5(2) అధికరణం ప్రకారం కాకుండా పరిమితమైన అధికారాలు కలిగిన 5(1) అధికరణం ప్రకారంగా ఆ జీవోను తీసుకురావడంతో సుప్రీం కోర్టులో ఈ జీవో వీగిపోవడానికి ప్రధాన కారణమని వివరించారు. జీవో నంబర్‌ 3 అమల్లో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని దుయ్యబట్టారు.

టీడీపీ గోబెల్స్ ప్రచారాలను గిరిజనులు నమ్మరు..
సుప్రీం కోర్టులో కేవలం రివ్యూ పిటిషన్ వేసి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. జీవో నంబర్ 3 పై న్యాయపరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా  ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు టీచర్ ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్ వర్తించే విధంగా ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర గిరిజన సలహా మండలిలో కూడా ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందని కూడా గుర్తు చేశారు. తాము అధికారంలో ఉండగా గిరిజనులకు చేసిన ద్రోహాలను మరిచిపోయి సీఎం జగన్‌కు నీతులు చెబుతూ టీడీపీ అధినేత లేఖను రాయడం ఏమాత్రం సబబు కాదన్నారు. గిరిజనాభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ విషయంలో టీడీపీ చేసే గోబెల్స్ ప్రచారాలను గిరిజనులు ఎవరూ నమ్మరని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు

Advertisement
Advertisement