అయ్యో రామా..! | Sakshi
Sakshi News home page

అయ్యో రామా..!

Published Wed, Mar 30 2016 1:26 AM

development of the famous pilgrimage ramatirtham

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించడం లేదు. భద్రాచలం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న రామతీర్థంపై చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం తెలంగాణ రాష్ర్ట పరిధిలోకి వెళ్లిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం  నిర్ణయించింది. ఒంటిమిట్టతో పాటే రామతీర్థం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని, తొలివిడతగా రూ 1.73 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని గత ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న దేవాదాయశాఖ మంత్రి హామీలు గుప్పించినా కార్యరూపం దాల్చలేదు. శ్రీరామనవమి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో కంటితుడుపు చర్యగా ఇటీవల రూ.53 లక్షలు మాత్రం విడుదల చేసింది. దీంతో సర్కారు తీరుపై భక్తులు ధ్వజమెత్తుతున్నారు.
 
 రామతీర్ధం(నెల్లిమర్ల): రాష్ట్ర విభజన అనంతరం శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ నిర్వహించాలనే విషయమై కడప జిల్లాలోని అతి ప్రాచీనమైన ఒంటిమిట్ట, విజయనగరం జిల్లాలోనే అతి పెద్దదైన రామతీర్తం దేవస్థానాల మధ్య అప్పట్లో పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఒంటిమిట్టలోనే ఉత్సవాలను నిర్వహించేందుకు గత ఏడాది మార్చిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పట్లో ఉత్తరాంధ్రకు చెందిన భక్తులు, సాధువులు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు.
 
 దీంతో దిగొచ్చిన ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్టతో పాటు రామతీర్థంలోనూ ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అదే నెలలో జరిగిన ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు విచ్చేశారు. ఆ సందర్భంగా దేవస్థానం అభివృద్ది పనులకు ప్రభుత్వం రూ.1.73 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఒంటిమిట్టతో సమానంగా రామతీర్థం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని అప్పట్లో హామీలు గుప్పిం చారు.
 
 ఈ మేరకు ఆలయంలో చేపట్టాల్సిన పనులకు గత ఏడాది ఏప్రిల్ నెలలో దేవస్థానం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆలయ ప్రధాన ద్వారంతో పాటు దక్షిణ గోపుర నిర్మాణం, పురాతన బేడా అభివృద్ధి తదితర పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ప్రకటించి ఏడాదైనా ప్రభుత్వం ఆ నిధుల ఊసెత్తలేదు. మరికొద్దిరోజుల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతుందోనన్న భయంతో 15 రోజుల క్రితం రూ.58 లక్షలు విడుదల చేసింది. ఇంకా రూ 1.15 కోట్లు విడుదల కావాల్సి ఉంది.
 
 ఒంటిమిట్టకు రూ.వంద కోట్లు.. రామతీర్థానికి రూ.58లక్షలా?
 రామతీర్థంతో పాటు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించే ఒంటిమిట్ట ఆలయానికి రూ.వంద కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్థుతం అక్కడ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే రామతీర్థానికి మాత్రం అందులో 20వ వంతు రూ.58 లక్షలు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఉత్తరాంధ్ర అంటే టీడీపీ సర్కారుకు అంత చులకనా అని భక్తులు ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి ప్రకటించిన మొత్తంతో పాటు అదనంగా అవసరమయ్యే నిధులు విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement