ఎమ్మిగనూరు ఆదర్శం | Sakshi
Sakshi News home page

ఎమ్మిగనూరు ఆదర్శం

Published Sun, Jul 12 2015 2:48 AM

Development works

కర్నూలు సిటీ: జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, అంతర్గత రహదారులన్నీ సీసీ రోడ్లతో కళకళలాడనున్నాయి. ఇంటింటికీ మరుగుదొడ్డితో, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా రోజుకు 40 లీటర్ల తాగునీటిని కూడా సరఫరా చేయనున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో మాతాశిశు మరణాల మాటే ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గంగా రూపుదిద్దుకోనుంది. ఆ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఇప్పటికే కలెక్టర్ వద్దకు చేరాయి. రాష్ర్టంలోని ప్రతి జిల్లాలో ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో కుప్పంను ఎంపిక చేశారు. ఇదే తరహాలో జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిషత్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం అమోద ముద్ర వేసిందంటే.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
  గ్రామాలకు బీటీ రోడ్లు, అంతర్గత రోడ్లన్నీ సీసీ రోడ్లతో కళకళలాడటంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక, మాద్యమిక, ఉన్నత పాఠశాలలన్నింటికీ తాగు నీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించనున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించనున్నారు. క్రీడాకారులకు మంచి కోచ్‌లతో ఆయా క్రీడల్లో శిక్షణనిచ్చేందుకు ప్రత్యేకంగా బహుళ ఉపయోగ(మల్టీపర్పస్) క్రీడా స్టేడియం అందుబాటులోకి రానుండటం విశేషం. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవ చూపినట్లు తెలుస్తోంది.
 
 ఆదర్శ నియోజకవర్గం వల్ల వచ్చే ప్రయోజనాలు ఇవీ..
 నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మాతా, శిశు మరణాలు పూర్తి స్థాయిలో తగ్గించడం.
 
 ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు స్వచ్ఛమైన తాగు నీరు, బాలబాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించడం.
 
 ప్రాథమాక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల్లో మధ్యలోనే బడి మానేసే విద్యార్థుల సంఖ్యను జీరోకు తీసుకురావడం.
 
 వయోజనులందరిలో 100 శాతం అక్షరాస్యత సాధించి, వారి ఉపాధికి ఆయా వృత్తుల వారికి వివిధ రంగాల్లో నిపుణులచే శిక్షణ ఇప్చించడం.
 
 నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి, కుబుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించి, వేస్టేజ్‌ను శాస్త్రీయ  100 శాతం స్వఛ్చ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుంది.
 
 గ్రామీణ ప్రాంతాలతో సహా ప్రతి ఒక్కరికీ రోజు కు 40 లీటర్ల చొప్పున తాగు నీటిని సరఫరా.
 
 వ్యవసాయంలో ఆధునీక పద్ధతులను ఉపయోగించి గతంలో పండించే పంటల దిగుబడిని రెండింతలు చేసేందు కు రైతులకు ప్రత్యేక రాయితీ.
 
 రాబోయే రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయల నుంచి నియోజకవర్గ కేంద్రానికి బీటీ రోడ్లతో అనుసంధానం చేయడం. అదేవిధంగా పంచాయతీల్లో అన్ని వీధులకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం.
 
 నియోజకవర్గంలోని నిరుద్యోగులకు సరైన నైపుణ్యాలపై శిక్షణనిచ్చేందకు ప్రత్యేక నైపుణ్య కేంద్రాల ఏర్పాటు.
 
 క్రీడాకారులకు మంచి శిక్షణనిచ్చి.. ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం బహుళ ప్రయోజన క్రీడామైదానాన్ని నిర్మించడం.
 
 ఆదర్శ నియోజకవర్గంగా ఎమ్మిగనూరు
 ఎంపికకు ప్రతిపాదనలు
 జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదించాం. ఈ ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్‌కు ఇటీవలే సమర్పించాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల దీనికి ఇప్పటి వరకు ఆమోదముద్ర పడలేదు. త్వరలోనే నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రణాళిక సిద్ధం చేస్తాం.
 -బి.ఆర్.ఈశ్వర్, జిల్లా పరిషత్ సీఈఓ
 
 నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా
 ఎమ్మిగనూరు ‘ఆదర్శ’ నియోజకవర్గంగా ఎంపికవుతోంది. ఇకపై నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను చేరవ చేస్తాం. వంద శాతం అక్షరాస్యత సాధించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రతి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఫిర్యాదుల కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. ముఖ్యంగా సాగునీటి సమస్యను పరిష్కరించి ఆయకట్టుదారులందరికీ న్యాయం చేస్తాం.    -బి.వి.జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
 

Advertisement
Advertisement