పోగాలమిది.. | Sakshi
Sakshi News home page

పోగాలమిది..

Published Fri, Feb 14 2014 3:24 AM

Developments in cases surfaced handled

సాక్షి, అనంతపురం : ఢిల్లీ పరిణామాలపై సమైక్యవాదులు రగిలిపోతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ పిలుపు మేరకు  గురువారం చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి.

పౌర సేవలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రూ.40 లక్షల మేరకు ఆదాయం కోల్పోయింది. తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి బద్రీనాథ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించి, నాయకులు, కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. అనంతపురం నగరంలో వైఎస్సార్‌సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 తొలుత సుభాష్ రోడ్డులోని మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి.. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను చింపివేశారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. అనంతరం ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ విభజనపై కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు.
 
 టీ బిల్లును లోక్‌సభలో పెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు వై.మధుసూదన్‌రెడ్డి, సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విడపనకల్లులో రాస్తారోకో నిర్వహించారు.
 
 తెలంగాణ బిల్లును కేంద్రం మొండిగా లోక్‌సభలో ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ ధర్మవరంలో సమైక్యవాదులు రోడ్డుపై మోకాళ్లతో నడిచి నిరసన వ్యక్తం చేశారు.
 
 కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం సమన్వయకర్త బి.తిప్పేస్వామి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అనంతరం తెలంగాణ బిల్లు ప్రతులను కాల్చివేశారు.
 
 మడకశిరలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
 
 పెనుకొండలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మంగమ్మ ఆధ్వర్యంలో బంద్‌ని ర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.
 
 పుట్టపర్తిలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్.హరికృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
 
  రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి సమైక్య పరుగును ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకోవడం సిగ్గుచేటన్నారు.
 
  తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నమన్వయకర్త వీ.ఆర్.రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement