పీజీ మెడికల్‌ విద్యార్థుల ధర్నా | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్‌ విద్యార్థుల ధర్నా

Published Thu, Jun 11 2020 4:09 AM

Dharna of PG Medical Students in all over AP - Sakshi

విజయవాడ (హెల్త్‌ యూనివర్సిటీ)/గన్నవరం రూరల్‌/నెల్లూరు అర్బన్‌/భీమిలి/శ్రీకాకుళం రూరల్‌/: ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాల్లో సీట్లు పొందిన పీజీ మెడికల్, డెంటల్‌ అభ్యర్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం ధర్నాలకు దిగారు. ప్రైవేట్‌ మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో పీజీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించిన విషయం విదితమే. కాగా.. తొలివిడత సీట్లు పొందిన అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం 3గంటల్లోగా కళాశాలల్లో చేరాల్సి ఉండగా, ప్రైవేట్‌ కళాశాలలు చేర్చుకోలేదు. దీనిని నిరసిస్తూ వందలాది విద్యార్థులు విజయవాడలోని హెల్త్‌ యూనివర్సిటీ, వివిధ ప్రైవేట్‌ కళాశాలల ఎదుట ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొన్ని వైద్య కళాశాలలు ఎక్కువ ఫీజులు డిమాండ్‌ చేస్తున్నాయని.. తమకు పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించడం లేదని వాపోయారు. 

► కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ పీజీ సీట్లు పొందిన విద్యార్థులు ఆ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ‘జీవో–56 విద్యార్థులకు వరం.. సేవ్‌ జీవో–56. వెంటనే సీట్లు కేటాయించాలి’ అంటూ నినాదాలు చేశారు.  
► నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కళాశాలలో సీట్లు పొందిన పీజీ వైద్య విద్యార్థులు తమను వెంటనే కళాశాలలో చేర్చుకోవాలని డిమాండ్‌ చేస్తూ కళాశాల ఎదుట ధర్నా జరిపారు. యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని, అప్పటివరకు  సంయమనం పాటించాలని సూచించారు. 
► విశాఖ జిల్లా సంగివలస ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ సైన్సెస్‌ ఎదుట పీజీ అడ్మిషన్లు పొందిన 31 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. 
► శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్‌ ఆసుపత్రిలో పీజీ కోర్సుల్లో తమకు ప్రవేశాలు కల్పించాలంటూ వైద్య విద్యార్థులు ఫ్లెక్సీలతో కళాశాల ఎదుట ఆందోళన జరిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 
► ఏలూరు సమీపంలోని ఆశ్రం మెడికల్‌ కళాశాల వద్ద పెద్ద సంఖ్యలో పీజీ అభ్యర్థులు ధర్నా చేశారు. 
► విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఎదుట పీజీ అడ్మిషన్లు కోరుతూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. 
► అభ్యర్థులతో మాట్లాడిన యూనివర్సిటీ అధికారులు కళాశాలల్లో చేరే గడువును ఈనెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించగా.. అభ్యర్థులు వెనుదిరిగారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement