విజృంభిస్తున్న అతిసార | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న అతిసార

Published Sat, Aug 24 2013 1:22 AM

Diarrhoeal in the village zone ranjol booming

జహీరాబాద్, న్యూస్‌లైన్: మండలంలోని రంజోల్ గ్రామంలో అతిసార విజృంభిస్తోంది. తాజాగా శుక్రవా రం చంద్రమ్మ(55) అనే మహిళ అతిసార సోకి మరణించింది. దీంతో ఇప్పటివరకు ఈ అతిసార బారిన పడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. రెండు రోజుల క్రితం లక్ష్మయ్య అనే వ్యక్తి మరణించగా, గురువారం ఉదయ్‌కిరణ్ అనే బాలుడు మరణించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు. చంద్రమ్మ అతిసారతో నీరసించడంతో గురువారం రాత్రి ఆమెను కుటుంబ సభ్యులు జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం తెల్లవారుజామున బీదర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి తరలించిన కొద్దిసేపటికే ఆమె మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
 
 ఆమె మృతదేహాన్ని రంజోల్ గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన 12 మంది అతిసార బారినపడి జహీరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలోనూ పలువురు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో అతిసారం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించడంతో శుక్రవారం కలెక్టర్ దినకర్‌బాబు గ్రామాన్ని సందర్శించారు. చంద్రమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పనులను సత్వరం నిర్వహించేందుకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కలెక్టర్ గ్రామ ప్రజలను కోరారు. అతిసార వ్యాధిని అదుపులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని అదేశించారు.
 
 మంచినీటి సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని, ఎక్కడైనా పైపులైన్ లీకేజీలు ఉంటే సరిచేయించాలని ఆదేశించారు. అనంతరం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వైద్యం పొందుతున్న అతిసారగ్రస్థులను పరామర్శించారు. రోగుల పరిస్థితి గురించి వైద్యురాలు కిరణ్మయిని అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా మల్‌చల్మ పీహెచ్‌సీ సిబ్బందిని అస్పత్రికి అటాచ్ చేయాల్సిందిగా సూచించారు. గ్రామ ప్రజలు వ్యాధి తీవ్రత గురించి కలెక్టర్‌కు వివరించారు.
 
 అధికారులతో సమీక్ష
 రంజోల్ గ్రామంలో వ్యాపించిన అతిసారను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు కలెక్టర్ దినకర్‌బాబు ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా వైద్యాధికారి రంగారెడ్డి, సంగారెడ్డి ఆర్డీఓ రాంచందర్‌రావు, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి ఇన్‌చార్జి వైద్యుడు శ్రీనివాసన్, డీఎల్‌పీఓ మనోహర్, అర్‌డబ్ల్యూఎస్, మల్‌చల్మ, మొగుడంపల్లి వైద్యాధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ విక్రంసిహారెడ్డిలతో సమావేశమయ్యారు. అతిసారను అదుపులో చేయడంతో పాటు మరింత విస్తరించకుండా ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement