సబ్సిడీ స్వాహా! | Sakshi
Sakshi News home page

సబ్సిడీ స్వాహా!

Published Thu, Apr 28 2016 1:21 AM

Diesel subsidy wayside

 కాకినాడ సిటీ : కాకినాడ రేవులో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లకు ఇస్తున్న సబ్సిడీ డీజిల్ పక్కదారి పడుతోంది. కొందరు అక్రమార్కులు మత్స్య శాఖ అధికారుల సహకారంతో తప్పుడు పాస్ పుస్తకాల ద్వారాసబ్సిడీని స్వాహా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కుటుంబంలోఒకరికే ఆయిల్ సబ్సిడీ వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురి (భార్య, భర్త, పిల్లలు) పేర్లతో మంజూరు చేసిన పాస్ పుస్తకాలతో, ఒకే బోటును రెండు ప్రాంతాల్లో వేర్వేరు నంబర్లు, పేర్లతో చూపించి తీసుకున్న పుస్తకాల ద్వారా సబ్సిడీ సొమ్మును కాజేస్తున్నారు. మరోపక్క సముద్రంలో వేటకు మాత్రమే వినియోగించాల్సిన సబ్సిడీ డీజిల్‌ను ఇతరపనులకు వినియోగిస్తున్నారు.
 
 కాకినాడ రేవులో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లకు సంబంధించి నాలుగు వందలకు పైబడి సబ్సిడీ పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇందులో సుమారు వంద వరకు తప్పుడు పాస్ పుస్తకాలని అంచనా. 2002 తరువాత సబ్సిడీ పుస్తకాలు కొత్తబోట్లకు మంజూరు చేయకూడదన్న నిబంధనను ఉల్లంఘించి మత్స్యశాఖాధికారులు పలు బోట్లకు మంజూరు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వేటకు వెళ్ళే ఒక్కో మెకనైజ్డ్ బోటుకు నెలకు మూడువేల లీటర్ల రాయితీ డీజిల్‌ను అందజేస్తున్నారు. వినియోగించుకున్న ఈ డీజిల్‌కు సబ్సిడీగా లీటరుకు రూ.6.03 చొప్పున రూ.18,090 నగదు బిల్లు రూపంలో చెల్లిస్తున్నారు. ఏళ్ల తరబడి భారీ ఎత్తున సబ్సిడీ సొమ్ము స్వాహా జరుగుతున్నట్టు గుర్తించిన పలువురు సంబంధిత శాఖ జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోక పోవడంతో కలెక్టర్‌తో పాటు మత్స్యశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖాధికారుల్లో కదలిక వచ్చి 2004లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బోట్లకు సంబంధించి నాలుగు కుటుంబాలకు చెందిన ఎనిమిది బోట్ల పాస్ పుస్తకాలను గుర్తించి నిలుపుదల చేసినట్టు సమాచారం.
 
 నామమాత్రంగా గుర్తింపు ప్రక్రియ
 వేట నిషేధం ప్రారంభమయ్యూక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజుల క్రితం జిల్లావ్యాప్తంగా చేపట్టిన బోట్ల గుర్తింపును నామమాత్రంగా పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ల పొడవు, వెడల్పు, లోతు ఆధారంగా తనిఖీలు చేపట్టకుండా ఒడ్డున ఒకచోట కూర్చుని బోట్ల యజమానులు తీసుకువచ్చిన పత్రాలను పరిశీలించి గుర్తింపు సంఖ్య ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అక్రమంగా ఉన్న కొన్ని పాస్ పుస్తకాలను సక్రమం చేసుకునేందుకు నంబర్ లేని బోట్లను తీసుకుని పాస్ పుస్తకంలో ఉన్న బోటు నంబర్ వేసుకునే విధంగా అక్రమార్కులకు మత్య్సశాఖాధికారులు సహకరించినట్టు ఆరోపణ.
 
 రెండు ఫిర్యాదులపై విచారణ : డీడీ
 డీజిల్ సబ్సిడీ స్వాహాపై జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డెరైక్టర్ టి.కళ్యాణంను వివరణ కోరగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. తమకు రెండు ఫిర్యాదులు రావడంతో విచారణ జరుపుతున్నామన్నారు. ఇటీవల బోట్ల సర్వే చేపట్టామని, ఆ నివేదికలను పరిశీలించి అక్రమాలు ఉంటే చర్యలు చేపట్టడమే కాక దుర్వినియోగమైన సబ్సిడీని రికవరీ చేస్తామని చెప్పారు.
 

Advertisement
Advertisement