సంక్షామం | Sakshi
Sakshi News home page

సంక్షామం

Published Mon, Apr 6 2015 2:40 AM

Diet charges preposterous from four months

నాలుగు నెలలుగా అందని డైట్ చార్జీలు
రెండు నెలలుగా ట్యూటర్‌లకు అందని గౌరవ వేతనం
వార్డెన్‌లకు తప్పని ఎదురుచూపులు

 
సాక్షి, కడప : వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు చెందిన వసతి గృహాలు ప్రస్తుతం నిధులు లేక నీరసిస్తున్నాయి. విద్యార్థులకు ప్రతినిత్యం ఆహారం అందించే వార్డన్‌లకు ఇంతవరకూ డైట్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆకలి కేకలు తప్పడంలేదు. మొన్నటి వరకు గురుకులాల్లో ఇదే సమస్య నెలకొనగా.. తాజాగా బీసీ సంక్షేమశాఖను ఈ సమస్య వెంటాడుతోంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే పరిణామం.

కోట్లలో బిల్లులు పెండింగ్..

జిల్లాలో సుమారు 59 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. అందులో సుమారు 4 నుంచి 5 వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రతినిత్యం మెనూ ప్రకారం భోజనం, టిఫిన్, పాలు, గుడ్డు, అరటిపండు లాంటి ఆహారాన్ని సంబంధిత వార్డెన్ అందజేయాల్సి ఉంది. అనంతరం అయిన ఖర్చులను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తూ వస్తోంది.

అయితే ప్రస్తుత తరుణంలో కొన్ని హాస్టళ్లకు 2014 డిసెంబర్ నుంచి డైట్ చార్జీలు రాకపోగా.. మరికొన్ని హాస్టళ్లకు జనవరి నుంచి మూడు నెలలుగా డైట్ ఛార్జీలు అందలేదు. కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులకు సరైన ఆహారం అందించడం వార్డన్‌లకు తలకుమించిన భారంగా మారింది. ఇప్పటికే ఒక్కో వార్డెన్‌కు దాదాపు రూ. మూడు లక్షల మేర బిల్లులు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా లెక్కకడితే కోట్లల్లో డైట్‌ఛార్జీలు రావాల్సి ఉంది.

భారంగా మారిన మెనూ..

బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ప్రతి నిత్యం మెనూ ప్రకారం ఆహారం అందించడం వార్డెన్‌లకు సమస్యగా మారింది. ఎందుకంటే మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో ప్రస్తుత మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలంటే కష్టంగా మారింది. దీంతో మెనూలోని కొన్ని ఆహార పదార్థాలకు వార్డెన్‌లు మంగళం పాడినట్లు తెలుస్తోంది.

రెండు నెలలుగా ట్యూటర్‌లకూ అందని జీతం..

బీసీ సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న ట్యూటర్‌లకు కూడా రెండు నెలలుగా గౌరవ వేతనం అందకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రెండు నెలలుగా గౌరవ వేతనం రావాల్సి ఉంది. వెంటనే గౌరవ వేతనం అందించి కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని ట్యూటర్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది :- విల్సన్, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి

ప్రభుత్వం నుంచి బీసీ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు రావాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేస్తే పంపిణీకి చర్యలు తీసుకుంటాం. ట్యూటర్లకు గౌరవ వేతనం అందాల్సి ఉంది. డైట్ ఛార్జీలు నాలుగు నెలలకు సంబంధించి రావాలి.

Advertisement
Advertisement