జనం నుంచి వనంలోకి | Sakshi
Sakshi News home page

జనం నుంచి వనంలోకి

Published Sun, Feb 16 2014 1:16 AM

జనం నుంచి వనంలోకి

మేడారం నుంచి సాక్షిప్రతినిధి: గిరిజన మహా జాతర ముగి సింది. నాలుగు రోజులుగా కోటి మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేశారు. సమ్మక్క... ఆ తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును వారివారి వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించి వనప్రవేశం చేయించారు. సమ్మక్కను ముందుగా సాయంత్రం 6.01 గంటలకు.. మిగిలిన ముగ్గురినీ 6.20 గంటలకు గద్దెల నుంచి కదిలించారు.

 

వన దేవత వనప్రవేశం కార్యక్రమం సాయంత్రం పూజలతో మొదలయింది. గిరిజన పూజారులు డోలుచప్పుళ్లతో గద్దెపైకి చేరుకుని పూజలు చేశారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని గిరిజన పూజారుల బృందం గద్దెలపైకి చేరుకుని పూజలు నిర్వహించిన తర్వాత భక్తులను దాటుకుంటూ గద్దెల ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లి తల్లిని వన ప్రవేశం చేయించారు.
 
 సారలమ్మకు పూజలు
 
 గోవిందరాజులు, పగిడిద్దరాజులకు పూజలు జరుగుతుండగానే సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. అక్కడ గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పద్ధతుల్లో పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మెంటె(వెదురుబుట్ట)ను తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ సమయంలో పూజారులను తాకడానికి ప్రయత్నించారు. అంతకుముందే పగిడిద్దరాజు, గోవిందరాజులును ఇలాగే పూనుగొండ, కొండాయికి చేర్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి దేవతల వనప్రవేశ సమయంలోనూ భక్తులు భారీగా హాజరై మొక్కులు సమర్పించుకున్నారు. దేవతల వనప్రవేశంతో మేడారం జాతర ముగి సిందని వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ చెప్పారు. ప్రస్తుత జాతరకు కోటి మంది భక్తులు వచ్చారని, భక్తులు మేడారం చేరుకునేందుకు లక్ష వాహనాలు వచ్చాయని తెలిపారు. వరంగల్ రూరల్ ఎస్పీ ఎల్.కాళిదాసు మాట్లాడుతూ 1.30 కోట్ల మంది భక్తులు వచ్చారని, రోడ్లు వెడల్పుగా ఉండడం వల్ల వాహనాలు రెండుమూడు వరుసల్లో వచ్చి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యిందని తెలిపారు.
 

Advertisement
Advertisement