రెండో రోజూ కౌన్సెలింగ్ కష్టాలు | Sakshi
Sakshi News home page

రెండో రోజూ కౌన్సెలింగ్ కష్టాలు

Published Wed, Aug 21 2013 1:20 AM

Difficulties in the second day of the counseling

నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు మంగళవారం కూడా ఆటంకం ఏర్పడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా పాలిటెక్నిక్ కళాశాలల ఉద్యోగులు విధులను బిహ ష్కరించడంతో రెండో రోజు కూడా కౌన్సెలింగ్ జరగలేదు. నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగోతరగతి సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రు లు అవస్థలు పడ్డారు. విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల ఉద్యోగులు గేట్లకు తాళాలు వేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కళాశాలల వద్దకు భారీ ఎత్తున సమైక్యవాదులు తరలివచ్చారు. ప్లకార్డులు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో ఆం దోళన చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.  
 
నినాదాల హోరు
 సమైక్యాంధ్ర నినాదాలతో పాలిటెక్నిక్ కళాశాలల పరిసరాలు దద్దరిల్లాయి. విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీయడం సరికాదని ఏపీ ఎన్జీజీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు మండిపడ్డారు. రవాణా, రెవెన్యూ శాఖలు సమ్మెలో ఉంటే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వలిశెట్టి దామోదర్ ప్రశ్నించారు.

సీమాంధ్ర విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, మరింత ఉద్యమిస్తామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిషోర్‌కుమార్ హెచ్చరించారు.కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద సమైక్యవాదులు ఆటపాటలతో అల రించారు. జాతీయ రహదారిపై మహిళా ఉద్యోగులు కబడ్డీ, తాడుతో బల ప్రదర్శన ఆటలు ఆడారు. గిరిజన సంప్రదాయ థింసా నృత్యం చేశారు. జాతీయ రహదారిని అర్ధగంట సేపు సమైక్యవాదులు దిగ్బంధించారు. రోడ్డు కు ఇరువైపులా బైఠాయించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్టు ప్రకటించే వరకు కౌన్సెలింగ్ జరపరాదని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
 
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
 కౌన్సెలింగ్ కోసం జిల్లా నలుమూలల నుంచి అభ్యర్థులు, తల్లిదండ్రులు ఉదయాన్నే వచ్చారు. కేంద్రాల్లో ఉద్యోగులు లేరని తెలిసినా ఎదురు చూశారు.  ఏ క్షణాన్నైనా ప్రక్రియ మొదలవుతుందని ఆశపడ్డారు. సాయంత్రం వరకూ వేచి ఉండి నిరాశతో వెనుతిరిగారు.
 
కౌన్సెలింగ్ ఉందో లేదో చెప్పాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కో-ఆర్డినేటర్ కిషోర్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ నాలుగోతరగతి సిబ్బంది విధుల్లోకి వస్తేనే కౌన్సెలింగ్  నిర్వహిస్తామన్నారు. లేనిపక్షంలో చేసేదేమిలేదన్నారు. రెండో రోజు సైతం ఇదే విధంగా జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వం సరైన సమాచారం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో వారంతా పాలిటెక్నిక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా ఇతరులను కాని, నైపుణ్యం లేని వ్యక్తులతో కాని కౌన్సెలింగ్  నిర్వహించవద్దంటూ కో-ఆర్డినేటర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడం విశేషం.
 

Advertisement
Advertisement