కొంత మోదం... అధిక ఖేదం | Sakshi
Sakshi News home page

కొంత మోదం... అధిక ఖేదం

Published Fri, Mar 13 2015 2:48 AM

Disappointment 2015 budget

     నిరాశపరిచిన బడ్జెట్
     బడ్జెట్‌లో  చంద్రబాబు హామీలకు దక్కని చోటు  
     తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, జంఝావతి ప్రాజెక్టులకు మాత్రమే నిధుల కేటాయింపు
     వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు మొండిచేయి

 
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ కొంతమోదం, అధికశాతం ఖేదం మిగిల్చింది. దీంతో జిల్లా వాసులను తీవ్ర నిరాశకు గురయ్యారు.  గతంలో సీఎం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. అయితే వాటికి    ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.  ఆ హామీలను గాలికొదిలేసినట్టు బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం తోటపల్లి, తారకరామతీర్థసాగర్, జంఝావతి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి చంద్రబాబు సర్కార్ చేతులు దులుపుకొంది.  కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రస్తావన కూడా రాలేదు. ఇంటికొక ఉద్యోగమని ఎన్నికలప్పుడు ఊకదంపుడు ప్రసంగాలు చేసిన చంద్రబాబు ఇప్పుడెలా ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పలేదు. ఈ బడ్జెట్‌తో జిల్లాకు కొత్తగా ఒరిగిందేమీ లేదని జిల్లా వాసులు తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు.
 
 మూడు ప్రాజెక్టులకు అరకొర నిధులు... రెండింటికి మొండిచేయి
 2015-16 బడ్జెట్‌లో తోటపల్లి, తారకరామతీర్థసాగర్, జంఝావతి ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించారు. తోటపల్లికి రూ.162 కోట్లు, తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టుకు రూ.44.80 కోట్లు, జంఝావతికి రూ.4.5 కోట్లు కేటాయించారు.  గత ఏడాది నాటికి తోటపల్లి అంచనా వ్యయం రూ. 774కోట్లు  కాగా అందులో రూ.600 కోట్లు వరకు ఖర్చు చేశారు. ఆ లెక్కల ప్రకారమైతే రూ.174కోట్లు అవసరం ఉంది, కానీ తాజాగా పెరిగిన ధరల నేపథ్యంలో మళ్లీ అంచనా వ్యయం మారినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల మేర నిధుల అవసరముంది. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.161.98కోట్లు కేటాయించింది.
 
 అవసరం మేర మంజూరు చేయనప్పటికీ  పనుల ముందుకెళ్లడానికి ఈ నిధులు దోహద పడతాయి. ఇక తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులు చకచకా సాగాలంటే రూ.200కోట్లు అవసరం ఉంది. కానీ ప్రభుత్వం కేవలం రూ.43కోట్లను మాత్రమే కేటాయించింది. ఇవి ఎంతమేరకు సరిపోతాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంటే ఇంతవేగంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. ఇక, జంఝావతికి కేవలం రూ.4.5 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారు.  పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు కేటాయించలేదు. తోటపల్లి, తారకరామ తప్ప మిగతా ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకోలేదేమో అన్పిస్తోంది.
 
 హామీల ప్రసావనే లేదు...
 గత ఏడాది అసెంబ్లీలో జిల్లా అభివృద్ధి ప్రణాళిక పేరుతో ప్రకటించిన హామీలు అమలుకు నోచుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఎందుకంటే, వాటిలో ఒక్కదాన్ని కూడా బడ్జెట్‌లో పొందపరచలేదు. వాటి కోసం నిధులు కేటాయింపులు చేయలేదు సరికదా వాటిని ఏర్పాటు చేస్తామనే ప్రకటన కూడా చేయలేదు.   లలిత కళల అకాడమీ ఏర్పాటు, స్మార్ట్ సీటీగా విజయనగరం, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, పారిశ్రామిక నగరం, హార్డ్‌వేర్ పార్క్, నౌకాశ్రయం నిర్మాణం తదితర హామీల ఊసే బడ్జెట్‌లో కనిపించలేదు. ఏడాదిలోగా తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆమేరకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఇక గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కళాశాల అనేవి కేంద్రం చూపే కరుణపై  ఆధారపడి  ఉంటాయి
 
 జిల్లాలో ఇచ్చిన హామీలు గాలికి ....
 చంద్రబాబు  జిల్లాకొచ్చినప్పుడు ఇచ్చిన హామీలు కూడా గాలిలోనే కలిసిపోయాయి. బడ్జెట్‌లో వాటి ప్రస్తావనే తీసుకురాలేదు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు,   చీపురుపల్లి రెవెన్యూ డివిజన్, చీపురుపల్లిలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు, గరివిడిలో పశు సంవర్థక  శాఖ కళాశాల, పార్వతీపురంలో  ఉద్యానవన కళాశాలను ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు వాటికి సంబంధించి నిధులు కేటాయింపు జరగలేదు. ఈ విధంగా ఇచ్చిన హామీలేవీ ఆచరణకు నోచుకోవడం లేదు. అలాగని కొత్త వాటిని ప్రస్తావించలేదు.   వెనకబడిన విజయనగరం జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.   
 

Advertisement
Advertisement