సిబ్బంది తక్కువ... ఒత్తిడి ఎక్కువ | Sakshi
Sakshi News home page

సిబ్బంది తక్కువ... ఒత్తిడి ఎక్కువ

Published Mon, Jan 4 2016 2:14 AM

Distribyutari transformers posts in srikakulam

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని జిల్లా ఇంజినీర్లు గగ్గోలు పెడుతున్నారు. ఒత్తిడి భారంతో లక్ష్యాలు సాధించలేకపోతున్నారు. దీంతో వీరికి ఉన్నతాధికారులు మెమోలు జారీ చేస్తున్నారు. ఓ వైపు కొత్త నియామకాలకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లేకపోవడం, మరోవైపు ఉన్న సిబ్బంది సెలవులు పెట్టడం, వ్యక్తిగత విషయాలపై విధులకు హాజరుకాలేకపోవడంతో ఆరునెలలుగా ఆదాయ సేకరణలో(సంస్థకు రెవెన్యూ రప్పించడం) వెనుకబడిపోతున్నారు. వాస్తవానికి తమది సర్వీస్ విభాగ మేనని ఈపీడీసీఎల్ చెబుతున్నా నెలవారీ రెవెన్యూ వసూళ్లలో వెనుకబడిన ఇంజినీర్లకు మెమోలిస్తుండడంతో ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో కనీసం 1200మంది కొత్త సిబ్బందిని ఇప్పటికిప్పుడు నియమించాల్సిందేనని అధికారులు తేల్చి ప్రభుత్వానికి లేఖ రాసినా అటు నుంచి స్పందన లేదు.
 
 పనిభారం ఎక్కువ
 జిల్లాలో సుమారు ఏడువేల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీ) ఉన్నాయి. 34 సెక్షన్‌లలో ఒక్కోసెక్షన్ పరిధిలో కనీసం 20 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క సర్వీసుకు సగటున 75 యూనిట్ల విద్యుత్ వినిమయం అవుతోంది. యూనిట్ ధర కనీసం రెండు రూపాయలైతే  వీటి ద్వారా నెలకు సుమారు రూ. 22 కోట్ల(లోవర్, హై టెన్షన్ కనెక్షన్‌ల ద్వారా) ఆదాయం వస్తోంది. ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 60 వేల కనెక్షన్లకు రూ. 7కోట్ల వరకూ రెవెన్యూ జమ అవుతోంది.
 
  వీటిల్లో 90 శాతం గృహ విద్యుత్ కనెక్షన్లే. ఆయా కనెక్షన్ల పరిధిలో కండెక్టర్ల నిర్వహణ, ఫ్యూజ్ ఆఫ్ కాల్, 600 ట్రాన్స్‌ఫార్మర్ల పర్యవేక్షణకు కేవలం ఇద్దరు ఏఈలు, ఒక ఏడీఈ, 30 మంది సిబ్బంది(వర్క్‌మెన్) ఉన్నారు. పట్టణం సహా శ్రీకాకుళం రూరల్, గార మండలాల కనెక్షన్లూ వీరే పర్యవేక్షించాలి. దీంతో వీరికి పనిభారం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ప్రతి 500 కనెక్షన్లకూ ఓ ఇంజినీర్ అవసరం అని అప్పట్లోనే గుర్తించారు. నాలుగు సెక్షన్లలో కనీసం నలుగురు ఇంజినీర్లు ఉండాలన్నది నిబంధన. వీరంతా పై విధులతో పాటు విద్యుత్ స్తంభాల మరమ్మతులు కూడా చేయించాలి. ఇదంతా చూస్తూనే నెలవారీ 100 శాతం రెవెన్యూ కలెక్షన్లు చేయాలంటూ ఆదేశాలొస్తున్నాయని ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే మెమోలు తప్పవంటున్నారు. రికవరీలకు సంబంధించి ఆర్‌ఆర్ యాక్ట్ అమలుపైనా తమపై ఒత్తిడి పడుతోందని వాపోతున్నారు.
 
 అధికారుల పరిస్థితీ అంతే
 ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఓ ఎస్‌ఈ స్థాయి అధికారి, 34 సెక్షన్ల ఇంజీనీర్లు, రెండు డివిజన్లకు డీఈలు, 10 మంది ఏడీఈలు, 600 మంది వర్క్‌మెన్ ఉన్నారు. వాస్తవానికి జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లుంటే విద్యుత్ శాఖ పరిధిలో ఇద్దరే అధికారులు ఉన్నారు. అదే విధంగా 13 మంది ఉండాల్సిన ఏడీఈలు 10మందే ఉన్నారు. కనీసం 1000 మంది ఉండాల్సిన వర్క్‌మెన్ కేవలం 600 మందే పనిచేస్తున్నారు. ప్రతీసెక్షన్‌కూ ఓ ఇంజినీర్ తప్పనిసరి అంటున్నా ఉన్న ఏఈలు ఇతర విధులకు కూడా హాజరుకావాల్సివస్తోంది. ఎల్‌డీసీ స్థాయి నుంచి చీఫ్ ఇంజినీర్(సీజీఎం స్థాయితో కూడా) వరకు భారీ స్థాయిలో పోస్టులు ఖాళీలు ఉన్నా కొన్నాళ్ల నుంచి భర్తీ చేయకపోవడంపైనా ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొన్నాళ్లుంటే భవిష్యత్‌లో పనిచేయలేం అని కిందిస్థాయిలో ఉన్న వర్క్‌మెన్ కూడా చెప్పేస్తున్నారు. చాలా ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న సిబ్బంది స్థానంలో కాంట్రాక్ట్ వ్యవస్థను పెట్టేస్తుండడంతో కార్పొరేషన్‌ను కూడా ప్రైవేటీకరణ చేసేస్తారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 ఓవర్ లోడ్
 టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పలాస, పాతపట్నం, సోంపేట, రాజాం, సీతంపేట, శ్రీకాకుళం, రూరల్ సబ్ డివిజన్ల పరిధిలో 38 సెక్షన్లకు ఒక్కో ఇంజినీర్ అధికారి ఉన్నప్పటికీ కిందిస్థాయి, పై స్థాయి అధికారుల సంఖ్య తక్కువగానే ఉంది. దీంతో వర్క్‌మెన్ పని కూడా కొన్ని చోట్ల ఏఈలే చేయాల్సివస్తోంది. ఈ నెలాఖరువరకు పరిస్థితి చూస్తాం అని అధికారులు, సంస్థలో మార్పు కనిపించకపోతే మూకుమ్మడి ఆందోళనకు రంగం సిద్ధం చేసుకుంటామని ఓ ఇంజినీర్ స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement