జిల్లాలో రూ.3915 కోట్ల రుణాలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో రూ.3915 కోట్ల రుణాలు

Published Thu, Mar 6 2014 2:52 AM

జిల్లాలో రూ.3915 కోట్ల రుణాలు

 వడిశలేరు(రంగంపేట), న్యూస్‌లైన్ :జిల్లాలో వివిధ రంగాల వారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3915 కోట్లు రుణాలుగా మంజూరు చేశామని ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్‌కే కల్రా తెలిపారు. బుధవారం స్థానిక శ్రీకాకతీయ కమ్మ కల్యాణ మండపంలో ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాధాన్య రంగాలకు రుణ వితరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో 107 శాఖల ద్వారా రూ.3373.71 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. చిన్న వ్యాపారులకు, సూక్ష్మ , చిన్నతరహా ప్రారిశ్రామికవేత్తలకు అభివృద్ధి పేరిట రూ.3 కోట్ల నూతన రుణ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఖాతాదారులకు 24 గంటలు సేవలందించేందుకు వీలుగా ఖాతాదారులే స్వయంగా నిర్వహించుకోగల ఏటీఎం, నగదు డిపాజిట్ మెషీన్, చెక్ డిపాజిట్ మెషీన్, పాస్‌బుక్ ప్రింటింగ్ మెషీన్‌తో కూడిన నవశక్తి శాఖల్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామన్నారు.
 
 ప్రతీ ఆంధ్రాబ్యాంక్‌కు ఒక ఏటీఎం ద్వారా నిరంతర సేవలందిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 72 ఏటీఎంలు ఉన్నాయన్నారు. బ్యాంక్ డిపాజిట్లు పెంచడం, రుణాలు తీసుకోవడం, సకాలంలో వాటిని తిరిగి చెల్లించడం ద్వారా వ్యాపారాభివృద్ధికి సహకరించాలని కోరారు. జిల్లాలో 1351 మహిళాశక్తి సంఘాలకు రూ.50.66 కోట్లు, ఇతర వ్యవసాయరంగానికి రూ.19.47 కోట్లు, సూక్ష్మ, చిన్న పారిశ్రామికవేత్తలకు రూ.41.16 కోట్లు, ఇతర రంగాలతో సహా మొత్తం రూ.112.35 కోట్లను రుణాలుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంతకుముందు ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య చిత్రపటానికి ఆయన పూలమాల వేసి, నివాళులర్పించారు.
 
 రైస్‌మిల్లర్లకు కూడా బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం కల్పించాలని టీడీపీ మండల అధ్యక్షుడు పెండ్యాల నళినీకాంత్ కోరారు. మెట్టప్రాంత రైతులకు పంటరుణాలకు రీషెడ్యూల్డు అవకాశం కల్పించాలన్నారు. వ్యవసాయ రుణాల్లో రైతులకు రాయితీలు పెంచాలని డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు పోతుల వెంకట్రాజు కోరారు. ఈ సందర్భంగా వరికోత యంత్రాలను, రుణ మంజూరు పత్రాలు తదితర వాటిని ఈడీ కాల్రా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ డీజీఎం వి.సత్యనారాయణ మూర్తి, ఏజీఎం వెంకటేశ్వరరావు, ఓంప్రకాష్, రంగంపేట, వడిశలేరు, తోకాడ బ్రాంచీల మేనేజర్లు వి.జయశంకర్, ఎం.గోపాల్, డీవీవీఎస్‌ఎన్ ప్రసాద్, సర్పంచ్ పైడిశెట్టి దొరయ్య, పీసీసీ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయిల్, ఐకేపీ ఏపీఎం శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement