కారుణ్య నియామకానికి రూ.లక్ష | Sakshi
Sakshi News home page

కారుణ్య నియామకానికి రూ.లక్ష

Published Mon, Aug 10 2015 12:41 AM

district medical and health department, corruption udalu

 సాంబమూర్తినగర్ (కాకినాడ) : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఊడలు పెరిగిపోతున్నాయి. కార్యాలయంలోకి పని కోసం వెళ్లాలంటేనే వైద్యాధికారులు, సిబ్బంది హడలెత్తిపోయే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ప్రతి పనికీ ముక్కు పిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నా ఆ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో సిబ్బంది అవినీతికి అంతేలేకుండా పోతోంది. తాజాగా వెలుగు చూసిన ఉదంతమే ఇందు కు నిదర్శనం. ఇంట్లో తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తూ మరణించినా, స్వచ్ఛంద పదవీ విరమణ పొందినా వారి కుటుంబంలో చదువుకున్న యువతీ యువకులలో ఒకరికి ప్రభుత్వం ఇచ్చే కారుణ్య నియామకానికి కూడా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగాల కోసం నలుగురు ఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
 
 రాజానగరంలో ఒకటి, ఇందుకూరుపేటతో పాటు ఏజెన్సీలో మొత్తం మూడు కారుణ్య నియామక పోస్టులకు ఖాళీలున్నాయి. వాటి భర్తీకి అభ్యర్థులు ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ సిబ్బందిని ఆశ్రయించారు. ఇదే అదనుగా ఆ సెక్షన్ సిబ్బంది ఒక్కొక్క పోస్టుకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌ఓ ఇన్‌చార్జ్ కావడంతో ఆమె స్థానంలో పూర్తిస్థాయి డీఎంహెచ్‌ఓగా వచ్చే వాళ్లు సంతకం చేయాల్సి ఉంది. వారికి ఎంతో కొంత ఇస్తేగానీ సంతకం చేసే పరిస్థితి లేదంటూ ఆ సెక్షన్ సిబ్బంది అభ్యర్థులకు చెప్పినట్టు సమాచారం.
 
 న్యాయపరంగా తమకు ఉద్యోగం రావాల్సి ఉన్నా డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది తమను వేధింపులకు గురిచేయడంపై వారు ఆందోళన చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీనిపై ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ షాలినీదేవి దృష్టికి తీసుకెళ్లగా తన వద్దకు కారుణ్య నియామక అపాయింట్‌మెంట్ కోసం ఎవరూ రాలేదని, వారు ఫిర్యాదు చే స్తే పరిశీలిస్తానని వివరణ ఇచ్చినట్టు యునెటైడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పలివెల శ్రీనివాసరావు తెలిపారు.
 
 చక్రం తిప్పుతున్న కీలక ఉద్యోగి
 డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ లో ఓ ఉన్నతోద్యోగి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కోనసీమలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన సయమంలో ఆయన నాలుగైదు పీహెచ్‌సీలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ పలు అక్రమాలకు పాల్పడినట్టు యూనియన్ల నాయకులు విమర్శిస్తున్నారు. సుఖీభవ పథకంలో సుమారు 40 డెలివరీ కేసులకు సంబంధించిన సొమ్ములను స్వాహా చేసి వైద్యాధికారులకు అందజేయడంలో ప్రధాన భూమిక పోషించాడంటున్నారు.
 
  వైద్యాధికారులకు అపాయింట్‌మెంట్ ఇచ్చే విషయంలోనూ ఒక్కొక్కరి నుంచి రూ.పది వేలు పైబడి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులందినా చర్యలు లేకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఉన్నతాధికారి, సిబ్బంది అవినీతిపై ప్రశ్నించేవారు తమను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని బెదిరిస్తున్నారంటూ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్రాసిటీ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదని, చేసేదేమీ లేక మిన్నకుండిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
 

Advertisement
Advertisement