టీడీపీతో కలిసి పనిచేయలేం | Sakshi
Sakshi News home page

టీడీపీతో కలిసి పనిచేయలేం

Published Mon, Jul 7 2014 1:37 AM

టీడీపీతో కలిసి పనిచేయలేం - Sakshi

- రుణాలమాఫీ హామీలతో బీజేపీకి సంబంధం లేదు
- ఇక నుంచి ఒంటరిగానే పోటీ చేస్తాం
- జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు

ఆచంట : జిల్లా టీడీపీలో ఇచ్చి పుచ్చుకునే ధోరణి కనిపించడం లేదని, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో బీజేపీని ఆ పార్టీ పూర్తిగా విస్మరించిందని, ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీతో కలిసి పనిచేయలేమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తెగేసి చెప్పారు. ఆదివారం సాయంత్రం స్థానిక రామేశ్వరస్వామి వారి సత్రంలో స్థానిక నాయకుడు మడిచర్ల శ్రీహరి అధ్యక్షతన నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది.

శ్రీనివాసవర్మ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో జిల్లాలో మూడు ఎంపీపీ అధ్యక్ష పదవులు, మరికొన్ని వార్డులు కేటాయించాలని కోరినా టీడీపీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల నుంచి ఒంటిరిగానే పోటీ చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీకి ఇచ్చిన హామీలతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఆగస్టులో జిల్లాలో పర్యటించనున్నారని, ఆయనకు సమర్పించేందు కు జిల్లా అభివృద్ధికి సంబంధించి నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిపారు. కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు పీవీఎస్ వర్మ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు పాకా సత్యనారాయణ ఆచంట మండల పార్టీ అధ్యక్షుడు రామిశెట్టి రామచంద్రరావు, తమ్మినీడి సూర్యనారాయణ, ఎం.నాగసుబ్బారావు, పంచదార రమేష్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement