ఇసుక మాఫియాకు ప్రభుత్వం అండ | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియాకు ప్రభుత్వం అండ

Published Mon, Jul 6 2015 1:17 AM

District sand mafia

సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ
 కాకినాడ సిటీ : జిల్లా ఇసుక మాఫియా ముందు అధికార యంత్రాంగం మోకరిల్లిందని  సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ ఆరోపించారు. కోరుమిల్లి గ్రామం లో శ్రమశక్తి సంఘం మహిళలపై పోలీసులు జరిపిన లాఠీచార్జీ అధికార పార్టీ అక్రమాలకు పరాకాష్టని పేర్కొన్నారు. ఆది వారం స్థానిక సుందరయ్యభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు తలలు పగిలేలా కొట్టారని, ఈ ఘటనలో సుమారు 100 మంది మహిళలు గాయపడ్డారన్నారు. కోరుమిల్లిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
 
  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 94 ప్రకారం సీసీ కెమెరాలు లేకుండా ఇసుక తవ్వకాలు జరగకూడదని, అటువంటిది జిల్లాలోని అన్ని ఇసుక ర్యాంపుల్లో సీసీ కెమెరాలు లేకుండానే లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేస్తున్నారన్నారు. నిర్దేశించిన జీఓ ప్రకారం నికర లాభాల్లో 25 శాతం వాటా స్థానిక శ్రమశక్తి గ్రూపులకు చెల్లించాల్సి ఉన్నా అది అమలు జరగడం లేదన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, కాంట్రాక్టర్లు ఇసుక మాఫియాగా ఏర్పడి దోచేస్తున్నారని ఆరోపించారు. మహిళలపై లాఠీచార్జి చేసి అక్రమంగా రాత్రి 10 గంటల వరకు నిబంధనలకు నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ  జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టీఎస్ ప్రకాష్, ఎం.వేణుగోపాల్ పాల్గొన్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement