ఉద్యమం @ 30 | Sakshi
Sakshi News home page

ఉద్యమం @ 30

Published Fri, Aug 30 2013 2:15 AM

Division over a month in

సాక్షి, మచిలీపట్నం : నెలరోజులు గడిచినా సమైక్య ఉద్యమంలో అదే జోరు.. అదే హోరు కనపడుతోంది. జిల్లాలో గురువారం ఆందోళనలు మిన్నంటాయి. హనుమాన్‌జంక్షన్‌లో పదివేల మంది విద్యార్ధులతో భారీ ప్రదర్శన జరిగింది. గుడివాడలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నాలుగు వేల మంది డ్వాక్రా మహిళలు ర్యాలీ తీశారు. 40 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. నెహ్రూ చౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 22వ రోజుకు చేరాయి. న్యాయవాదులు చేస్తున్న రిలేదీక్షలకు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సంఘీభావం తెలిపారు. విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా వెనక్కి నడిచి  నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బస్టాండు సెంటరులో మానవహారం నిర్మించి వంటావార్పు నిర్వహించారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో అంగన్‌వాడీ సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు, ఉషోదయ, డీఎస్‌ఆర్ పాఠశాలల విద్యార్థులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కైకలూరు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రోడ్డుపై ఆటలు ఆడారు.  

కలిదిండిలో తాడినాడ గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. ముదినేపల్లిలో ఉపాధ్యాయులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. జగ్గయ్యపేటలో రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో  మున్సిపల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన దీక్షలో మండల డీలర్లు కూర్చొని సంఘీభావం తెలిపారు.  మున్సిపల్ కూడలిలో జరసం (జగ్గయ్యపేట రచయితల సంఘం) ఆధ్వర్యంలో రోడ్డుపై కవిసమ్మేళనం నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయం ముందు గుంజీలు తీసి నిరసన తెలిపారు.

అఖిలపక్ష నేతలు రోడ్డుపై సామూహికంగా భోజనాలు చేశారు. గన్నవరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే  దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. పెడన మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రిక్షా పుల్లర్స్ అసోసియేషన్ నాయకులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేశారు. కంచికచర్లలో  ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 10 వేల మందితో మహాధర్నా నిర్వహించారు. చల్లపల్లిలో జేఏసీ నాయకులు, రెవెన్యూ సిబ్బంది ట్రాక్టర్లు, లారీలు తుడిచి నిరసన వ్యక్తం చేశారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్‌లో న్యాయవాదులు వీధులను చీపుళ్లతో శుభ్రం చేసి నిరసన తెలిపారు.

ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు పట్టణంలో అర్ధనగ్నంగా  మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి మునేటి వాగులో జలదీక్ష చేశారు. కంకిపాడు సమైక్యాంధ్ర పరిరక్షణ  సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. కంకిపాడు-గన్నవరం రోడ్డు కూడలిలో మానవహారం నిర్వహించారు.  ఉప్పులూరు గ్రామంలో   కంకిపాడు-గన్నవరం రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. తిరువూరులో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బోసుబొమ్మ సెంటర్లో రోడ్డుపైనే పాఠాలు బోధించారు.

తాలూకా ఎన్జీవో యూనిట్ ఆధ్వర్యంలో మేకలు, గొర్రెలతో నిరసన ప్రదర్శన జరిపారు. మచిలీపట్నం  మునిసిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలో నలుగురు శానిటరీ మేస్త్రిలు కూర్చున్నారు. ప్రభుత్వాసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ైవె ద్యులు, సిబ్బంది ధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 30 రోజులైన సందర్భంగా 30 మంది వైద్యులు, సిబ్బంది నోటికి, చెవికి నల్ల రిబ్బన్‌ను కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.
 
బెజవాడలో.. విజయవాడలో  కార్పొరేషన్ ఉద్యోగులు రక్తదానం చేశారు. దుర్గగుడి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రవచనాలు చెప్పి నిరసన తెలిపారు. ఆటోనగర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జేసీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు  ఆధ్వర్యంలో  ఆ పార్టీ నేతలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు.

Advertisement
Advertisement