దీపావళి... అన్నింటా సామాన్యుడే బలి | Sakshi
Sakshi News home page

దీపావళి... అన్నింటా సామాన్యుడే బలి

Published Sat, Nov 2 2013 1:31 AM

దీపావళి... అన్నింటా సామాన్యుడే బలి - Sakshi

 

=తారాజువ్వల్లా పెరిగిన నిత్యావసర సరకుల ధరలు
 =వరద ముప్పుతో వెలగని మతాబుల్లా రైతులు
 =విభజన ‘చిచ్చు’బుడ్డికి అగ్గిరాజేసిన బాబు
 =సమైక్య ఉద్యమంలో సీమ టపాసుల్లా వైఎస్సార్‌సీపీ శ్రేణులు
 =కలియుగ నరకాసురులకు చరమగీతమెప్పుడో?

 
 మతాబుల వెలుగులతో... టపాసుల మోతలతో... దీపావళి నాటికి ఆనందోత్సాహాల్లో మునిగితేలాల్సిన జిల్లా ప్రజలు సమస్యల జడిలో ‘తడిసిన బాణసంచా’లా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సరకుల ధరలు చుక్కలనంటుతుంటే.. వర్షాలు పంటలను ముంచేస్తే.. విభజన ‘చిచ్చు’ ముల్లులా గుచ్చుకుంటుంటే.. భవిష్యత్తుపై బెంగతో అల్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో సామాన్య జనవాణి ఏవిధంగా ఉందో చూద్దామా..             
 
 
 టపాకాయల్లా పేలుతున్న ధరలు

 ‘దీపావళి పండుగొచ్చేస్తోంది నాన్నా టపాసులు కొను’ అంటూ రెండు రోజులుగా మారాం చేస్తున్న సుపుత్రుల గోల పడలేక చేతి సంచి తీసుకుని బజారుకు బయలుదేరాడు సూరిబాబు. వడివడిగా వెళుతున్న అతని వేగానికి అడ్డుకట్ట వేస్తూ ‘ఏమోయ్ సూరి ఎక్కడికి వెళుతున్నావ’ంటూ వెనుక నుంచి పలుకరించాడు రవిబాబు. ఏమీలేదు దీపావళి మందులను కొనేందుకు వెళుతున్నానంటూ బదులిచ్చాడు సూరిబాబు. అవును మా పిల్లలు కూడా ఒకటే గొడవ.. ఏం కొంటాం రా బాబూ.. దీపావళి టపాసులు కూడా కూరగాయాల ధరల్లాగ తారాజువ్వలను మించిపోయి పైపైకిపోతున్నాయి.

గతేడాదితో పోల్చితే ఇంకా 20 శాతం పైగా వాటి రేట్లు పెంచేశారాయే అంటూ రవిబాబు పెదవి విరిచాడు. మునుపటి రోజుల్లో దీపావళి వచ్చేసరికి పంట చేలు కళకళలాడుతుండేవి.. పల్లెలు, పట్నాలు సిరిసంపదలతో వెలుగుతుండేవి.. ఇప్పుడంతా సమస్యల చీకట్లే కదా అంటూ సూరిబాబు శృతి కలిపాడు. ఇంతలో వారికి తారసపడిన నాగబాబు మధ్యలో జోక్యం చేసుకుంటూ ‘ఏం చేస్తాం పాలకులు సైతం పట్టించుకోరు.. నిత్యావసర సరకుల ధరలు కూడా టపాసుల్లా పేలిపోతున్నాయి’ అన్నాడు. ‘ఇదివరకటి రోజుల్లో జేబుల్లో డబ్బులు తీసుకునిపోతే సంచుల నిండా సరకులు వచ్చేవి.. మరి ఇప్పుడో సంచుల నిండా సొమ్ము పట్టుకెళ్లినా సరకులు దోసిలి నిండట్లేదు అంతా కలికాలం’ అంటూ ముక్తాయించాడు రవిబాబు.
 
బాబు లేఖతో విభజన బాంబు


కాసేపటికి వారి సంభాషణ నిత్యావసర ధరలు, టపాసుల ధరల నుంచి సమైక్య ఉద్యమం వైపు మళ్లింది. అవునర్రా మన జిల్లాలో సమైక్య ఉద్యమం మతాబుల్లా వెలిగిపోయిందంటూ నాగబాబు చర్చను దారిమళ్లించాడు. అవునవును జిల్లాలో ఊరువాడా ఏకమై రాష్ట్రం ఒక్కటిగా ఉండాలంటూ సమైక్య ఉద్యమ కాంతుల్ని ప్రజ్వలింపజేశారు అంటూ నాగబాబు ప్రస్తావించాడు. కాంగ్రెసోళ్లు రాష్ట్ర విభజనకు ‘చిచ్చు’బుడ్డి లాంటి ఫార్ములాను తయారుచేస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి అగ్గిపుల్ల గీసి నిప్పురాజేశాడు అంటూ సూరిబాబు ఆవేశం వెళ్లగక్కాడు. ఏమాటకు ఆ మాట అనుకోవాలి నిజానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో ఆ పారీ శ్రేణులు సిసింద్రీల్లా చెలరేగి సమైక్య ఉద్యమానికి విష్ణుచక్రాన్ని అందించారని రవిబాబు గుర్తుచేశాడు.
 
పంటపై తుపాను... పేలని టపాసుల్లా రైతులు

 ఏం దీపావళి కాంతులో ఏమిటో సమైక్య ఉద్యమంపైన, రైతన్న ఆశలపైన తుపానులు, వర్షాలు నీళ్లు చల్లేశాయి అంటూ నిట్టూర్చాడు నాగబాబు. దీపావళి రోజులు వస్తే పంటచేలు పసిడి కాంతులతో కళకళలాడేవి రైతుల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయేవి ఇప్పుడు వర్షాల వల్ల ఆరిపోయిన చిచ్చుబుడ్డిలా వెలవెలబోతున్నాయంటూ సూరిబాబు ఆవేదన వెలిబుచ్చాడు. విభజన నిర్ణయంతో ప్రజలకు ఇంత కష్టం వచ్చినా... వర్షాల వల్ల రైతులకు ఇంత నష్టం వచ్చినా పాలకులు మాత్రం అగ్గిరాజేసి ఆ మంటల్లో వేడుక చూస్తున్నారంటూ రవిబాబు రుసరుసలాడాడు.

చూస్తాం చేస్తాం అంటూ ప్రకటనలు ఇస్తున్న జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం సిసింద్రీల్లా హడావుడి చేసి చివరికి చీదేస్తున్నారు.. అంటూ రవిబాబు ముక్తాయించాడు. అవునవును గత మూడేళ్లుగా తుపానులు, అకాల వర్షాలకు నష్టాపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.37 కోట్ల పరిహారం ఇంతవరకు పంపిణీ చేయలేదన్న సంగతి ‘సాక్షి’లో చదివానంటూ నాగబాబు శృతి కలిపాడు.

 సందట్లో సడేమియా...

 బాణసంచా షాపులోకి పోలీసులు వచ్చి దుకాణానికి అనుమతి లేదంటూ షాపు యజమానితో దబాయింపును చూసిన సూరిబాబు మరింత ఆసక్తి కనబరిచాడు. ఇంతలో గల్లాపెట్టిలోని థౌజండ్ వాలా నోటు ఇచ్చేసరికి అప్పటివరకు పెటేపికాయల్లా పేలిన పోలీసుల నోళ్లు టక్కున మూతపడ్డాయి. ఇంతలోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మీ షాపునకు అనుమతిలేదు నిన్ను మా ఆఫీసరు గారు రమ్మన్నారంటూ పిలిచారు.. వాళ్లను పక్కకు తీసుకెళ్లి చేతిలో ఫైవ్ హండ్రెడ్ వాలా నోటు పెడితే ‘రోడ్డుపైన కాకుండా కాస్త లోపలికి దుకాణం పెట్టుకో.. మా వాళ్లకు చెబుతాంలే’ అంటూ ఫైర్ సిబ్బంది చక్కా వెళ్లిపోయారు.

రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ఎవరికివారే వచ్చి అందినంత పుచ్చుకుని వెళ్లడం చూసిన సూరిబాబు వీళ్ల హడావుడి ఇందుకా అనుకుని మనసులోనే నవ్వుకుని ‘ఇదేంటి వీళ్లకు మామూళ్లు ఇవ్వాలా’ అంటూ షాపు యజమాని శ్రీనుని అమాయకంగా ప్రశ్నించాడు. ఏమనుకున్నావ్ బాబూ మొన్న ఒక్కో షాపునకు ఇంత మామూళ్లని రేటు పెట్టారు.. నిన్న ఏకంగా ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు రూ.20 వేల నుంచి 40 వేల లెక్కన గంపగుత్తగా సమర్పించుకోవాల్సిందే.. వాటితో పాటు దీపావళి బోనస్‌గా గిఫ్ట్ ప్యాక్‌లు ఇవ్వాల్సిందే అంటూ వాపోయాడు శ్రీను. ఇదంతా ‘మామూలే’ అనుకుంటూ వెనుతిరిగాడు.

ఎప్పుడో నరకాసురుడిని చంపితే ఇప్పుడు దీపావళి చేసుకుంటున్నాం.. మరి ఇప్పుడు పేట్రేగిపోయిన రాజకీయ అవకాశవాద నరకాసురులు, విభజన కోరుకునే కలియుగ నరకాసురులు.. లంచగొండి నరకాసురులు.. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే నరకాసురులు.. ఎందో మంది ఉన్నారు. వారిని ఎవరు తుదముట్టిస్తారు? అంటూ మనసులోనే మధనపడుతూ సూరిబాబు భారమైన మనస్సుతో.. తేలికైన క్రాకర్స్ సంచితో ఇంటిముఖం పట్టాడు.

రానున్నకాలంలో జనమే చైతన్యవంతమై.. తారాజువ్వల్లా ఎగిసి.. ఓటు అనే విష్ణుచక్రంతో కలియుగ నరకాసురుల్ని తుదముట్టించిననాడే అచ్చమైన దీపావళి.. ఆ రోజు ఎప్పుడొస్తుందో అనుకుంటూ నిట్టూరుస్తున్న సూరిబాబును ‘నాన్నా టపాసులు తెచ్చావా’ అంటూ పిల్లల పలకరింపుతో అతని ఆలోచనలకు తెరపడింది.
 

Advertisement
Advertisement