పట్టిసీమ వల్ల ఉపయోగం లేదు | Sakshi
Sakshi News home page

పట్టిసీమ వల్ల ఉపయోగం లేదు

Published Sat, Mar 21 2015 2:04 AM

Do not use that time to

కడప సెవెన్ రోడ్స్ :  పట్టి సీమ ఎత్తిపోతల పథకంవల్ల ఎవరికీ ఉపయోగం లేదని, అందరూ వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి ఆ పథకాన్ని నెత్తికి ఎత్తుకోవడం ద్వారా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. పట్టిసీమ నిర్మాణం ఆపాలంటూ అఖిలపక్ష రైతు సంఘాలు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ మినహా అన్ని పార్టీలు, రైతులు వ్యతిరేకిస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొండిగా వ్యవహరించడం తగదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు 45టీఎంసీల నీరు వాటాగా వస్తుందన్నారు. దుమ్ముగూడెం - నాగార్జున సాగర్ టేల్‌పాండ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తే మరో 160టీఎంసీల గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఆ మేరకు శ్రీశైలంలో నీటిని ఆదా చేసి రాయలసీమ, దక్షిణ తెలంగాణా జిల్లాల్లో మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నికర జలాలను అందించవచ్చునన్నారు. దాన్ని వదిలేసి పట్టిసీమను పట్టుకోవడం అర్థరహితమని విమర్శించారు. ఎన్‌టి రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలు బ్రతికి ఉంటే రాయలసీమకు ఇలాంటి దుర్గతి దాపురించేదికాదన్నారు. ఇంతకమునుపు 9ఏళ్ల పాలనలో చంద్రబాబు సీమకు అన్యాయం చేశారన్నారు. చివరి దశలోనైనా ఆయన రాయలసీమ ప్రాజెక్టుల పరిపూర్తికి కృషి చేయాలని కోరారు.

ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రామసుబ్బారెడ్డి, జి.చంద్ర, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి కోసం ఇచ్చిన కేటాయింపులలో అధిక భాగం పట్టిసీమకు ఖర్చు చేయడం శోచనీయమన్నారు. ఇందువల్ల పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారి సీమ ప్రాజెక్టుల భవిత అంథకారంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  సీమ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరో 12వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు.   

రాష్ట్ర విభజన నేపథ్యంలోనైనా పోలవరం పూర్తిచేసి కృష్ణ, గోదావరి నదుల అనుసందానం ద్వారా సీమ ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని డిమాండు చేశారు.   కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు మనోహర్‌రెడ్డి, ఓబులయ్య, వైసీపీ రైతు విభాగపు నాయకులు రాంగోపాల్‌రెడ్డి, పుల్లారెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రామారావుకు వినతి పత్రం అందజేశారు.

Advertisement
Advertisement