ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్యాయత్నం

Published Sat, Nov 16 2013 3:35 AM

do not want to have the wedding, the bride and attempted to commit suicide

హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ :  ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఓ వధువు పెళ్లైన గంటల వ్యవధిలోనే ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా హిందూపురంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన అరుణ (24)కు, అదే ప్రాంతానికి చెందిన మణికంఠతో శుక్రవారం ఉదయం 10 గంటలకు పెద్దపులేకమ్మ గుడిలో వివాహమైంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు వధూవరులతో పాటు బంధువులంతా వధువు ఇంటికి చేరుకున్నారు. ఇల్లు చిన్నదిగా ఉండడంతో వరుడు, బంధువులు బయట మాట్లాడుకుంటుండగా దుస్తులు మార్చుకునేందుకని అరుణ ఇంట్లోకి వెళ్లింది.
 
 అప్పటికే ఈ పెళ్లి తనకు ఇష్టం లేకపోవడంతో అరుణ మానసికంగా కుమిలిపోయింది. ఈ క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న బంధువులు షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని మంటలు ఆర్పి 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే 70 శాతం శరీరం కాలిపోయింది. ఈ ఘటనతో అంబేద్కర్ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.  ‘పెళ్లి ఇష్టం లేకపోయినా కొన్నాళ్లకు మారుతుందిలే అనుకుంటే ఇంత పని చేసిందేమయ్యా’ అంటూ అరుణ తల్లి నాగమ్మ, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
 
 అనారోగ్యంగా ఉండడంతో తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని అరుణ చెబుతుండేదని, అయితే ఆడపిల్లను ఎంతకాలం ఇంట్లో పెట్టుకునేదని.. కళ్ల ముందే ఇంటికి దగ్గరే ఉంటుంది కదా అని పెళ్లి చేసినట్లు నాగమ్మ విలపించింది. భర్త దూరమై పదేళ్లైందని, మునిసిపాలిటీలో కాంట్రాక్ట్ స్వీపర్‌గా పని చేస్తూ ఇద్దరు కుమార్తెలకు ఏ లోటూ రాకుండా చూసుకున్నానని తెలిపింది. పెద్ద కుమార్తెకు పెళ్లయిపోయిందని, చిన్న కూతురు పెళ్లి కోసం తెలిసివారితో డబ్బు తెచ్చి చేశానని చెప్పింది. ఇలా చేసుకుంటుందని కలలో కూడా ఊహించలేదని కన్నీరుపెట్టుకుంది. టూటౌన్ సీఐ ఈదుర్‌బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement