వైద్యుల నిర్లక్ష్యం వల్లే రేవతి మృతి! | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యం వల్లే రేవతి మృతి!

Published Mon, Oct 6 2014 1:24 AM

వైద్యుల నిర్లక్ష్యం వల్లే రేవతి మృతి!

 కాకినాడ క్రైం :కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువతి మృతి చెందింది. అయితే  దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు పంచాయతీ పరిధి తారకరామనగర్‌కు చెందిన కర్రి రేవతి దేవి (24) మీ-సేవ కేంద్రంలో పనిచేస్తోంది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమెను 12 రోజుల క్రితం కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీయూ)లో ఉంచి చికిత్సనందించారు. శనివారం అర్ధరాత్రి ఆమె పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. డ్యూటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోవడంతో జూనియర్ డాక్టర్లకు తెలిపారు. వారు పట్టించుకోలేదు. పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆమె మృతి చెందింది.
 
 కుటుంబ సభ్యుల ఆగ్రహం
 తాము ఎంత మొత్తుకున్నా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి రేవతి దేవి ప్రాణాలు తీశారంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్ గేటు వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. అక్కడి నుంచి రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ అద్దంకి శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. విషయం సూపరింటెండెంట్ డాక్టర్ పి. వెంకటబుద్ధ దృష్టికి వెళ్లడంతో ఆయన సూచన మేరకు సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ స్వప్న కుమారి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేవతి దేవి కుటుంబ సభ్యులు సూపరింటెండెంట్, వన్‌టౌన్ పోలీసులకు వినతి పత్రాలు అందజేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement