Sakshi News home page

బాబోయ్.. కుక్కలు

Published Sun, Oct 11 2015 2:37 AM

బాబోయ్.. కుక్కలు - Sakshi

రోజుకు సగటున కుక్కకాటుకు గురవుతున్న వారు : 100 మందికిపైనే
రుయా ఆస్పత్రికి రోజుకు సగటున వచ్చేవారు : 40 మందికిపైనే

సాక్షి ప్రతినిధి, తిరుపతి/ కార్పొరేషన్ : జిల్లాలో కుక్కల బెడద అధికమవుతోంది. వీటి బారినపడి పలువురు ఆస్పత్రులపాలువుతున్నారు.  తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో పట్టపగలే కుక్కలు గుంపు సంచరిస్తోంది వైద్యం కోసం పరుగులు కుక్కకాటుకు గురైన బాధితులకు తక్షణ వైద్య సాయం అందడంలేదు.

తిరుపతి, తిరుపతి రూరల్, చంద్రగిరి, భాకరాపేట, పాకాల, పూతలపట్టు, పీలేరు, పచ్చికాపల్లం, రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తిరుపతి రుయా ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. మొదటిసారి కుక్క కరిసిన వారు రోజుకు సరాసరి 35 మందికి తక్కువలేకుండా వస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగు సార్లు కరిసిన వారు నెలకు 500కు తక్కువలేకుండా వస్తున్నారు.  
 
నియంత్రణ నిల్
వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. టీకాలు వేయడంలోనూ ఆయా శాఖల అధికారులు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో కుక్కల సంతతి పెరిగిపోతోంది.
 
అనిమల్ కేర్ సంస్థే దిక్కు
ఒక్క తిరుపతిలోనే దాదాపు 10వేలకు పైగా కుక్కలు ఉన్నాయి. వీటిలో 70 శాతం కుక్కలకు జనన నియంత్రణ చేయించారు. అనిమల్ కేర్‌ల్యాండ్ సంస్థ నిర్వాహకులు రేబీస్ వ్యాధి సోకకుండా టీకాలు వేస్తున్నారు.
 
పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలు
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలోని సందువీధి, బలిజపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మూడు రోజులుగా పిచ్చికుక్క భాకరాపేటలోని పలు వీధులలో సంచరిస్తూ కనిపించిన వారిపై దాడి చేస్తుంది. ఈ విషయం అధికారులు పట్టించుకోకపోవడంతో కుక్క దాడిలో ఇంత మంది గాయాలు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

శుక్రవారం సందు వీధికి చెందిన అమరనాధరెడ్డి, పెద్దపాపమ్మను కుక్క గాయపరిచింది. అనంతరం శనివారం ఉదయం రెడ్డమ్మ, రోజా, నారాయణమ్మ, నాగవేణి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. కుక్క దాడిలో గాయపడిన వారు భాకరాపేట పీహెచ్‌సీలో చికిత్స పొందారు.

Advertisement
Advertisement