తొలిసంతకం ..తూచ్చేనా..? | Sakshi
Sakshi News home page

తొలిసంతకం ..తూచ్చేనా..?

Published Thu, Jul 3 2014 2:28 AM

తొలిసంతకం ..తూచ్చేనా..? - Sakshi

‘కాకి బావా ... నీ అరుపే ఆహ్లాదం ... నీవు రాగం అందుకుంటే ఆహా అద్భుతం ... ఇక పాట పాడితే మైమరిచిపోవల్సిందే ... ఈ అడవిలో నీ కేకే కోకిల రాగం ... ఒక్కసారి గొంతెత్తి కొంగొత్త ఆలాపన చేయు మిత్రమా’ అని చెట్టుపైనున్న కాకినుద్దేశించి నక్క బావ అనడంతో  పాపం ఆ కాకి ‘కావ్’ మంటూ కర్ణకఠోరంగా అడవి అదిరిపోయేట్టు అరిచింది. అంతే అడవంతా తిరిగి సంపాదించికున్న మాంసం ముక్క నోటి నుంచి జారిపడి కిందపడిపోయింది. కింద పడిన మాంసం ముక్కను నోట కరుచుకొన్న నక్క ఎంచక్కా గంతులేస్తూ అడవి దాటిపోయింది. ఈ కథ చందమామ పుస్తకంలో చదివినట్టుగా ఉంది కదూ. ఔనండీ ... ఈ ముచ్చటనే మన చంద్రన్న పాలనకు అన్వయించుకుందాం.
 
నక్క బావలానే చంద్రబాబు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుణమాఫీ అనే మాయమాటలు చెప్పి ... ఎండమావుల్లాంటి హామీలిచ్చారు. కాకినోటనన్ను మాంసం ముక్కలాంటి ఓట్లను రైతన్నల వద్ద నుంచి దండుకొని ఆచరణకు వచ్చేసరికి మాట మార్చి కష్టాల్లో ఉండే కర్షకులకు కన్నీళ్లనే మిగుల్చుతున్నారు. బ్యాంకు నుంచి నోటీసులు వచ్చినా ... బెదిరింపులకు దిగుతున్నా అవసరం తీరాక తెప్ప తగలేసిన చందంగా నారా వారు నోరు తెరవడం లేదు.
 
 సాక్షి, ఒంగోలు:
దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం దారంవారిపాలేనికి చెందిన మంచాల నారాయణరెడ్డి రెండెకరాల సాగు కోసం తూర్పుగంగవరం ఆంధ్రా బ్యాంకు బ్రాంచిలో పంటరుణం రూ.60 వేలు తీసుకున్నాడు.  టీడీపీ నేతల మాటలు నమ్మి బ్యాంకు రికవరీ చెల్లించకపోవడంతో, నేడు కోర్టు నుంచి నోటీసు అందుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే బయట తెచ్చిన అప్పులు తీర్చలేక నానాయాతన పడుతోన్న క్రమంలో... బ్యాంకు కోర్టు నోటీసులివ్వడంతో తన పరిస్థితేంటని దిగాలు పడుతున్నాడు.
 
* కనిగిరి నియోజకవర్గం పిల్లివారిపల్లెకు చెందిన రైతు మేకల బాలయ్య కూడా పంట రుణానికి సంబంధించి బ్యాంకు నోటీసు అందుకున్నాడు. ఎకరా పొలం సాగు పెట్టుబడికి ఏడు సవర్ల బంగారం తనఖాపెట్టి రుణం తీసుకున్నాడు. వర్షాభావ పరిస్థితులతో పంట చేతికి రాలేదు. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ పథకంతో బాకీ తీరుతుందనుకున్నాడు. ఆ రైతు భవిష్యత్ ప్రణాళిక తిరగబడింది. బాబు తొలిసంతకం తూఛ్..అంటూ రికవరీ లేకుంటే ఆభరణాలు వేలం వేస్తామని పినాకినీ బ్యాంకు నోటీసు పంపింది. ఉన్న ఒక్క బర్రెను అమ్మి వడ్డీనైనా చెల్లించి.. అసలు మొత్తానికి వాయిదా కోరుదామనే ఆలోచనలో ఉన్నాడు.
 
 ఇలా ఒక్కో రైతుది ఒక్కో ఆవేదన. చంద్రబాబు శుష్క వాగ్దానాలు నమ్మి ఓటేసిన పాపానికి..ఇంతకాలం పరువుగా బతికిన కుటుంబాలు వీధికెక్కుతున్నాయి. ఓటేసి గెలిపిస్తే..పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పడంతో..రుణాలు కట్టకుండా మాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు రుణాలు వెంటనే తీర్చాలంటూ వస్తున్న బ్యాంకు నోటీసులు షాకిస్తున్నాయి.
 
 ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ అమలుపై పూటకోమాట చెబుతుండటంతో పాటు... బ్యాంకర్ల నోటీసుల జారీ దూకుడును నియంత్రించలేకపోతోంది. పొగాకు రైతుల పంట అమ్మకం డబ్బులు వారి ఖాతాల నుంచి అప్పులకింద జమ చేసుకుంటున్నట్టు బ్యాంకులు ప్రకటిస్తున్నా... కనీసం, రైతులపక్షాన ప్రభుత్వం నిలబడి బ్యాంకర్లతో మాట్లాడి భరోసానిచ్చే ధైర్యం చేయలేకుంది. రుణమాఫీ అమలుపై కమిటీలు వేశామంటూ కాలయాపన చేస్తూనే.. ఈసారికి రుణాల రీషెడ్యూల్ చేద్దామనే ప్రకటనలతో రైతులు నిండామునిగే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే కిందటి ఆర్థిక సంవత్సరం తీసుకున్న పంటరుణాల రికవరీ గడువు తీరిపోవడంతో.. ప్రభుత్వ వడ్డీరాయితీ వర్తించకపోగా, 7 శాతం వడ్డీకాస్తా 11.75 శాతం రుణం తీసుకున్న నాటినుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 ప్రస్తుతం జిల్లాలో అన్ని మండలాల్లో ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, పినాకినీ, యూనియన్ బ్యాంకు తదితర శాఖలు రైతులకు నోటీసులిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తుండగా, ప్రస్తుతం బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు సగానికిపైగా ఉన్నారు. జిల్లాలో జాతీయ బ్యాంకుల రుణాలు మొత్తం రూ.5,600 కోట్లు మాఫీకావాల్సి ఉండగా, సహకారబ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మరో రూ.488.67 కోట్ల మేర మాఫీకావాల్సి ఉంది. బంగారం ఆభరణాలు తాకట్టుపెట్టి పంటరుణాలు తీసుకున్న వారు జిల్లాలో 1.30 లక్షల మంది రైతులుండగా, మాఫీకావాల్సిన రుణ మొత్తం రూ.1300 కోట్లుగా బ్యాంకర్లు తేల్చారు. వేలంలో ఆభరణాలు పోతాయని రైతులు  వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
 
 నోటీసుల వెల్లువ..
* యర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల్లో దాదాపు 45 వేల మంది రైతులు పంట, బంగారం తాకట్టు రుణాలు తీసుకున్నారు. బంగాం తాకట్టుపెట్టి లక్ష రూపాయలకు పైబడి రుణాలు తీసుకున్న రైతులకు పెద్దారవీడు, పుల్లలచెరువు మండలాల్లో 66 మందికి బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు.
 
* సంతనూతలపాడు నియోజకవర్గంలో  రైతుల బకాయిలన్నీ కలుపుకొని దాదాపు రూ.160 కోట్లు ఉంటాయని అంచనా. పంట రుణాలు, డ్వాక్రామహిళల రుణాలు, బంగారం రుణాలు తీసుకున్న వారు నాలుగు మండలాల్లో సుమారు 18 వేల మంది వరకు ఉంటారు. వారిలో ఇప్పటికే చీమకుర్తి ఆంధ్రాబ్యాంక్ గత నెల 16వ తేదీన 119 మంది రైతులకు రూ.80 లక్షల విలువ చేసే రుణాలను చెల్లించాలని నోటీసులిచ్చింది.
 
* కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోనే ఐఓబీ బ్యాంకు 300 మంది రైతులకు, పినాకినీ బ్యాంకు 500 మందికి నోటీసులు  జారీ చేసింది. ఇదేవిధంగా దర్శి, పర్చూరు, చీరాల, కందుకూరు, కొండపి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో పాటు ఒంగోలు రూరల్ ప్రాంత రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. బాధితులంతా ఈ నోటీసులకు సమాధానం చెప్పలేక, తమ తరఫున భరోసానిచ్చే నాథుడు లేక.. గోదాముల్లో పంట నిల్వలు, బంగారం ఆభరణాలు వేలంలో పోగొట్టుకోవాల్సి వస్తోందని బెంబేలెత్తుతున్నారు.

Advertisement
Advertisement