‘నల్లారి’ హామీలు.. నీటి మూటలు.. | Sakshi
Sakshi News home page

‘నల్లారి’ హామీలు.. నీటి మూటలు..

Published Tue, Nov 26 2013 12:43 AM

dont believe kiran kumar reddy words

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
 కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్లలో ఆయన జిల్లాలో అధికారికంగా ఐదుసార్లు పర్యటించారు. కిరణ్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నెరవేరలేదు.  దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మంజూరైన అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపు తప్పితే.. పెండింగ్ ప్రాజెక్టులు అంగుళం కూడా కదల లేదు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల, శ్రీపాదసాగర్ ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయి. వైఎస్సార్ హయాంలో పూర్తిచేసిన కొమురం భీమ్ ప్రాజెక్టును ప్రారంభించిన కిరణ్, అసంపూర్తిగా ఉన్న కాల్వల నిర్మాణాన్ని విస్మరించారు. దీంతో ప్రాజెక్టులో నీరున్నా పంటపొలాలకు సాగునీరు అందించలేని పరిస్థితి.
 
 ఆచరణకు నోచుకోని హామీలు..
 2010 డిసెంబర్ 6న సీఎం హోదాలో కిరణ్ మొదటిసారిగా జిల్లాలో పర్యటించారు. ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించిన ఆయన జిల్లాపై వరాల జల్లు కురిపించారు. 2011 ఫిబ్రవరి 5న రచ్చబండ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని తానూరులో నిర్వహించిన కార్యక్ర మలో పాల్గొన్నారు. అప్పుడు పుష్కలంగా హామీలు గుప్పించారు. 2011 నవంబర్ 19న రచ్చబండ రెండో విడతలో భాగంగా జిల్లాలో పర్యటించిన ఆయన ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో హామీలు వల్లెవేశారు. రిమ్స్‌లో ట్రామా, ఎమర్జెన్సీ కేర్ సెంటర్, 41 మంది వైద్యులు, 125 నర్సుల అదనపు నియామకం హామీ బుట్టదాఖలైంది. ఐదు మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసేందుకు నిధులు కేటాయింపు హుష్‌కాకీ అంది. కొద్దిపాటి నిధులతో కొమురం భీమ్, నీల్వాయి, మత్తడివాగు, గొల్లవాగు ప్రాజెక్టులు పూర్తయి 46 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే అవకాశం ఉంది.
 
  ఆ నాలుగు ప్రాజెక్టులపై రూ.400 కోట్లకు పైగా ఖర్చు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తే, రూ.40 కోట్ల పనులపై ఆయన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆసిఫాబాద్ మండలంలోని అడ గ్రామం వద్ద నిర్మించిన కొమురం భీమ్ ప్రాజెక్టు వ్యయం ప్రారంభంలో రూ. 274.14 కోట్లు కాగా అనంతరం రూ.450 కోట్లకు పెరిగింది. కాల్వలు పూర్తికాకున్నా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు ప్రకటించి సీఎం కిరణ్ ప్రారంభించినా ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన కొమురం భీమ్ ప్రాజెక్టును ప్రారంభించడం తప్ప ఐదింటిలో ఒక్క ప్రాజెక్టుకు పూర్తయ్యే నిధులు ఇవ్వలేదు.
 
 ప్రాణహిత-చేవెళ్ల, శ్రీపాదసాగర్ సహాఅన్నీ పెండింగే..
 జాతీయ హోదా, నిధుల లేమీ కారణంగా ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులు సహా జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగ లేదు.  ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో కిరణ్ సర్కారు వివక్ష చూపిందన్న విమర్శలు ఉన్నాయి. వీటితోపాటు కాగజ్‌నగర్ మండలంలోని జగన్నాథపూర్ గ్రామం శివారులోని పెద్దవాగు వద్ద జగన్నాథ్‌పూర్ డైవర్షన్ స్కీము, ముథోల్ నియోజవర్గంలోని భైంసా, ముథోల్, లోకేశ్వరం మండలాలకు చెందిన 14 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో గడ్డెన్నవాగు ప్రాజెక్టు, మంచిర్యాల డివిజన్ వేమనపల్లి సమీపంలోని నీల్వాయిలతో పాటు పలు ప్రాజెక్టులు నేటికి అసంపూర్తిగా ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా జిల్లాలో 1.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిందించేందుకు రూ.7,600 కోట్లు విడుదల అటకెక్కింది.
 
 ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కలగానే మిగిలింది. జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రక్షిత మంచినీటి పథకాలకు రూ.120 కోట్లు మంజూరు కాలేదు. మొదటి, రెండో విడతల రచ్చబండల్లో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన హామీలు నేటి అపరిష్కృతంగానే ఉన్నాయి.
 

Advertisement
Advertisement