సంయమనం కోల్పోవద్దు | Sakshi
Sakshi News home page

సంయమనం కోల్పోవద్దు

Published Sat, Mar 22 2014 12:05 AM

don't  lose patience

సాక్షి, కాకినాడ :
రాష్ట్రంలో 40 రోజుల వ్యవధిలో వరుస ఎన్నికలు వచ్చాయని, విధుల్లో పాల్గొనే ఉద్యోగులు సంయమనం కోల్పోకుండా ఈ యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన బి.రామాంజనేయులు, సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టుహాలులో ఎన్నికలకు నియమితులైన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ఒకే లొకేషన్‌లో రెండు పోలింగ్‌స్టేషన్లు ఉంటే, ఓటర్లు ఇబ్బంది పడకుండా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని అంశాలు శిక్షణల్లో తెలుసుకున్నందున ఎవరి పనుల్లో వారు నిమగ్నమవ్వాలన్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో పోలీసు శాఖ చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు.
 

రాజమండ్రి అర్బన్ ఎస్పీ మూర్తి మాట్లాడుతూ నగరంలో 30 లొకేషన్లు హైపర్‌సెన్సిటివ్‌గాను, 35 లొకేషన్లు సెన్సిటివ్‌గాను గుర్తించామన్నారు. ఎక్కడికక్కడ నిబంధనల మేరకు సాయుధ సిబ్బందిని నియమించామన్నారు. నగరంలో తొమ్మిడి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, 600 మందిని బైండోవర్  చేశామన్నారు.
 
139 ఆయుధ లెసైన్సులకు గాను 93 ఉపసంహరించుకున్నామని, 46 రక్షణ కార్యకలాపాల్లో ఉండగా, రెండు కమిషన్ అనుమతిలో ఉన్నాయన్నారు. మిగిలిన వాటి ఉపసంహరణకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ వివిధ మున్సిపాలిటీలో 290 పోలింగ్ కేంద్రాల్లో 12 హైపర్ సెన్సిటివ్ ఉన్నాయన్నారు. 23 స్ట్రైకింగ్ టీమ్‌లు, 10 స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్‌లు నియమించి, 30 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు.
 
అంతర్గత శాఖల సమన్వయంతో 13, తొమ్మిది ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఉండగా, 402 ఆయుధాలను సరెండర్ చేసుకున్నామన్నారు. 3,700 మందిని బైండోవర్ చేశామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ స్లిప్‌ల ముద్రణ కొనసాగుతోందన్నారు. ఈ నెల 22 నుంచి ఓటర్ స్లిప్‌లో మున్సిపల్ స్థాయిలో బూత్‌లెవెల్ అధికారులతో పంపిణీ చేయిస్తామన్నారు. 26వ తేదీకల్లా ఈవీఎంలు సిద్ధం చేస్తామన్నారు. ఇంతవరకు చెక్‌పోస్టుల తనిఖీ ద్వారా రూ.91 లక్షల విలువైన నగదు, ఇతర సామగ్రి సీజ్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు చర్యలు చేపడుతున్నామన్నారు.
 
వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు క్యూలైన్‌లో ఉంచకుండా లోపలికి వెంటనే అనుమతించాలని ఆర్‌ఓలను ఆదేశించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు అందాయని వివరించారు. ర్యాంపులు లేని చోట్ల తాత్కాలికంగానైనా ఏర్పాటు చేసి వికలాంగులకు సహకరించాలన్నారు.
 
ఈవీఎంల తనిఖీ
రానున్న మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు చేరుకున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ నీతూ ప్రసాద్ పరిశీలించారు. నడకుదురు మార్కెటింగ్ గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎంలను శుక్రవారం రాత్రి మొదటిస్థాయి చెకింగ్‌లో భాగంగా కలెక్టర్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలను భద్రపరిచే అంశంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. ఏజేసీ డి.మార్కండేయులు, సహాయ కలెక్టర్ ఆర్‌వీ కన్నన్, ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్
 తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement