ఉచిత విద్యుత్‌కు ఎసరు! | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌కు ఎసరు!

Published Mon, Oct 27 2014 4:19 AM

dout on free power scheme

 ఆదాయంతో లింకు పెట్టే యోచనలో సర్కారు
 కొనసాగుతున్న వ్యవసాయ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం
 సబ్సిడీ వర్తించకపోతే మార్కెట్ రేటు ప్రకారం చెల్లించాల్సిందే
 లక్షలాది మంది రైతులపై పెనుభారం

 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: తొమ్మిది గంటల ఉచిత విద్యు త్ కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి సర్కార్ షాక్ ఇవ్వబోతోంది. వ్యవసాయ విద్యుత్‌కు ఆదాయ పరిమితి లింకు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి వ్యవసా య కనెక్షన్‌ను బ్యాంకుల్లో, ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు సమాచారం. విద్యుత్ పంపిణీ నష్టాలున్న చోట్ల ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగతా ప్రాంతాల్లోనూ త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నారుు. ఫీడర్ స్థాయిలో సిబ్బందికి ఆదేశాలు వెళ్ళాయి. ఇదే జరిగితే రాష్ట్రంలోని 13.5 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ లబ్ధిదారుల్లో అనేక లక్షలమంది ఈ పథకానికి దూరమవుతారు. వీరంతా వాడిన ప్రతి యూనిట్‌కు మార్కెట్ రేటు ప్రకారం డబ్బు చెల్లించాల్సిందే. అంతిమంగా రైతుపై మోయలేని భారం పడుతుంది. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఒప్పందాల రోజే.. ఈ దిశగా ఆలోచన మొదలైంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రస్తావించారు. ప్రతి విద్యుత్ వినియోగదారుడికీ బ్యాంక్ ఖాతా ఉండేలా చూడాలన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. ముందుగా వ్యవసాయ కనెక్షన్లపై విద్యుత్‌శాఖ దృష్టిపెట్టింది. విద్యుత్ పంపిణీకి సంబంధించిన నష్టాలన్నిటినీ ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయ ఖాతాలోనే చూపిస్తూ వస్తోంది. కాబట్టి ఈ రంగానికిచ్చే విద్యుత్‌ను తగ్గించాలనే నిర్ణయానికొచ్చారు. ఆధార్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. రైతుకిచ్చే రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాకే జమ చేయాలనేది యోచనగా పైకి చెబుతోంది. కానీ ఉచిత విద్యుత్ లబ్ధిదారులను తగ్గించడమే అసలు లక్ష్యమని విద్యుత్‌రంగ నిపుణులంటున్నారు. ఇం దుకనుగుణంగా నెలాఖరుకల్లా ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు అంతర్గత ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది.

దక్షిణ, తూర్పు ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో ఇందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలో 2,84,965 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 56,774 కనెక్షన్లకు సంబంధించి లబ్ధిదారుల పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ కార్డులు అనుసంధానం చేశారు. ఆధార్ కార్డుల్లేని రైతుల కనెక్షన్లను ఉచిత విద్యుత్ కోటా నుంచి తొల గిస్తామని డిస్కమ్ వర్గాలంటున్నాయి. ఇందులో భాగంగా చిన్న, మధ్య, భారీ తరహా సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఒక కుటుంబానికి ఒక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కన్నా ఎక్కువ ఉంటే.. వాటిని ఉచిత విద్యుత్ కోటా నుంచి తప్పించనున్నట్టు సమాచారం. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల వల్ల చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు జలకళ తప్పింది. వాటి ఆయకట్టులో రైతులు బోర్లు, బావులు తవ్వుకుని సేద్యం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఆధార్‌కార్డులను అనుసంధానం చేయడంతో ఆ ప్రాజెక్టుల కింద రైతులకు ఒక్క కనెక్షన్‌కే ఉచిత విద్యుత్‌ను పరిమితం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీడింగ్ పూర్తయ్యాక ఉచిత విద్యుత్ రాయితీ లబ్ధిదారులైన రైతులు ఇప్పుడు నెలనెలా సర్వీసు చార్జీల రూపంలో చెల్లిస్తోన్న రూ.20తోపాటు విద్యుత్ బిల్లునూ ముందుగా చెల్లించాలి. ఆ తర్వాత రైతు చెల్లించిన విద్యుత్ బిల్లును రాయితీ రూపంలో వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఓ ఎస్పీడీసీఎల్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. ఆధార్ అనుసంధానం పూర్తయ్యాక ఆదాయ పరిమితిపై ప్రభుత్వం స్పష్టతిచ్చే అవకాశముంది.
 

Advertisement
Advertisement