Sakshi News home page

పింఛన్‌కు స్మార్ట్ సెగ

Published Thu, Nov 14 2013 4:39 AM

Dr YS rajasekharareddi welfare schemes launched by the state government

 కావలి, న్యూస్‌లైన్ : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తూ.చ.తప్పకుండా అమలుచేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పదేపదే మాటతప్పుతోంది. ఎంతో మంది పూటగడవడానికి ఆధారమైన
 
  పింఛన్‌కే ఎగనామం పెడుతోంది. నేరుగా రద్దు చేస్తే ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత తప్పదని భావించి అడ్డదారుల్లో కుట్ర అమలు చేస్తోంది. అందుకోసం స్మార్ట్ కార్డులను వినియోగించుకుంటోంది.  సంక్షేమ పథకాలకు కోతపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం రెండు నెలల క్రితం కావలి పట్టణంలో 500 మందికి పింఛన్లు కట్ చేసింది. ఇప్పుడు మరో 700 మందికి దాదాపు పింఛన్ రద్దు చేసేసింది. ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
 
 ఆ నిర్ణయాన్ని అడ్డదారిలో అమలు చేస్తోంది. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసమంటూ స్మార్ట్‌కార్డులను అందుబాటులోకి తెచ్చారు. లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్మార్ట్ కార్డుల్లో తప్పులున్నాయంటూ ఇప్పటికే పలువురికి పింఛన్లు నిలిపేశారు. స్మార్ట్‌కార్డుల రూపకల్పనలో సాంకేతికపరంగా జరిగిన తప్పులకూ లబ్ధిదారులనే బాధ్యులుగా చేస్తున్నారు. ఆధార్, రేషన్, స్మార్ట్‌కార్డులను ఒకదానితో ఒకటి పోల్చి ఏ ఒక్క వివరం సరిపోకపోయినా, కనీసం ఓ అక్షరం తేడా వచ్చినా లబ్ధిదారులకు పింఛన్ దూరమవుతోంది. మరోవైపు వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోయినా తర్వాత నెలలో వారికి పింఛన్ ఉండదు.
 
 ఈ క్రమంలో వివిధ కారణాలు చూపుతూ వందలాది మందికి కొన్ని నెలలుగా పింఛన్ అందించడం లేదు.  ఫొటోలు తీయించుకున్న వారికీ మళ్లీ తీయాలంటూ తిప్పుతున్నారు. వీరంతా వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోలేదనే సాకు చూపి జాబితాలో పేర్లు తొలగించేందుకేనని సమాచారం.  ఇదంతా తెలియని లబ్ధిదారులు ఇదేమి తెలియని లబ్ధిదారులు నెలల తరబడి వ్యయప్రయాసలకోర్చి పింఛన్ పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఓ వైపు ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు సక్రమంగా పింఛన్ పంపిణీ చేయని పాలకులు మళ్లీ అర్జీలు స్వీకరిస్తామంటూ 18వ తేదీన కావలిలో రచ్చబండ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం.
 
 ఇదేం తిప్పట బాబోయ్
 పింఛన్ల కోసం తిరిగి,తిరిగి విసిగి వేసారిపోయిన వందలాది మంది లబ్ధిదారులు బుధవారం కావలిలో ఆందోళనకు దిగారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు కొద్ది నెలలుగా వైకుంఠపురం మున్సిపల్ స్కూలులోని పింఛన్ల పంపిణీ కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ పంపిణీ చేసే సిబ్బంది వివిధ కారణాలు చెబుతూ వీరిని మళ్లీమళ్లీ తిప్పించుకుంటున్నారు. గత నెలలో వస్తే వారం తర్వాత ఇస్తామని, మళ్లీ వస్తే పది రోజుల తర్వాత అని, మరోసారి వస్తే రెండు నెలలకు కలిపి ఇస్తామని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ 5వ తేదీ నుంచి రోజూ పింఛన్ల కోసం తిరుగుతున్నామని, పింఛన్‌గా వచ్చే డబ్బు ఆటో చార్జీలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 వీరి బాధలను ‘న్యూస్‌లైన్’ మెప్మా సిబ్బంది రవీంద్రబాబు, పింఛన్లు పంపిణీ చేసే ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధి పవన్ దృష్టికి తీసుకెళ్లగా కొన్ని సాంకేతిక కారణాలతో గత నెలలో పింఛన్ చెల్లించలేదని చెప్పారు. స్మార్టు కార్డులకు సంబంధించి ఫొటోలు తీసే సమయంలోనూ  కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.
 
 ఖర్చులు తడిసి మోపెడయ్యాయి
  మక్బూల్ జాన్
 రూ.200 పింఛన్ కోసం గత నెల నుంచి 8 సార్లు పంపిణీ కేంద్రం చుట్టూ తిరిగాను. ఆటో చార్జీలు రూ.500 అయ్యాయి. ఎలాంటి ఆధారం లేని నాకు పింఛన్ ఉపయోగపడుతుందని అనుకున్నాను. ఇలా చేసే ప్రభుత్వం ఇక ఉండకూడదు.  
 
 తిప్పుకోవడం సరికాదు  
 రమణమ్మ
 వృద్ధులను ఇలా ఇష్టానుసారం తిప్పుకోవడం సరికాదు. వృద్ధాప్యంలో పింఛన్ ఆదరువుగా ఉంటుందనుకున్నాను. ప్రభుత్వం  మాపై చిన్నచూపు చూసింది. ఇది సరైన విధానం కాదు. దీనికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. మా ఉసురు తప్పక తగులుతుంది.
 

Advertisement
Advertisement