డ్రైవర్ నిర్లక్ష్యమే కాల్చేసింది | Sakshi
Sakshi News home page

డ్రైవర్ నిర్లక్ష్యమే కాల్చేసింది

Published Fri, Nov 8 2013 12:47 AM

డ్రైవర్ నిర్లక్ష్యమే కాల్చేసింది - Sakshi

‘పాలెం’ బస్సు దుర్ఘటనపై ప్రాథమిక విచారణలో నిర్ధారణ
 పూర్తిస్థాయి దర్యాప్తును ప్రారంభించిన సీఐడీ
 39 మృతదేహాల అప్పగింత... గుర్తింపు ప్రక్రియ పూర్తి

మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు దగ్ధం దుర్ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. డ్రైవర్ నిర్లక్ష్యమే అందుకు ప్రధాన కారణంగా అందులో తేల్చారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం, అతివేగం కూడా కారణాలని తెలిపారు. బస్సు కల్వర్టును ఢీ కొట్టడం వల్ల ఆయిల్ ట్యాంకర్ దెబ్బతిని మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. బస్సులోని అదనపు ఆయిల్ ట్యాంకుకు కూడా మంటలు వ్యాపించడంతో క్షణాల్లో బస్సు మొత్తం మంటలు ఆవరించాయని వివరించారు. ఈ మేరకు రూపొందించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గురువారం పోలీసు ఉన్నతాధికారులు అందించారు. అయితే, ప్రమాదానికి, బస్సు క్షణాల్లో దగ్ధం కావడానికి వేరే కారణాలేమైనా ఉన్నాయా? అన్న విషయం పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరమే తేలుతుంది. రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) పూర్తిస్థాయి దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించింది. ఈ అంశాలతో పాటు.. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ తలె త్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, రోడ్డు ఇంజనీరింగ్, బస్సులకు పర్మిట్లు ఇచ్చే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన వాటిని సీఐడీ పరిగణనలోకి తీసుకుంటోంది.
 
 ప్రమాదంలో మృతిచెందిన వారి తుది జాబితాను అధికారులు గురువారం ప్రకటించారు. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించిన మరో 4 మృతదేహాలను(అనిత, మంజునాథ్ రెడ్డి, మైథిలీ, గౌరవ్‌క్రాంత్‌రే) వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. దాంతో మొత్తం 39 మృతదేహాలు వారి సంబంధీకులకు చేరాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ చౌహాన్(23), సోనుకుమార్(52), విజయ్‌కుమార్(24)ల సంబంధీకులు రాకపోవడంతో వారి మృతదేహాలను ఉస్మానియా మార్చురీలో భద్రపర్చారు. బస్సు ప్రమాదంలో మొత్తం 45 మంది మృత్యువాత పడగా.. వారిలో 42 మందిని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తించారు. కాగా, మృతదేహాల గుర్తింపు ముగిసినందున ఇకపై ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తామని రాష్ట్ర ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ డెరైక్టర్ శారద తెలిపారు. బస్సులో వేగంగా మంటలు వ్యాపించడానికి కారణమేంటో తెలుసుకునేందుకు కెమికల్ ఎనాలసిస్ వింగ్ కృషిచేస్తోందన్నారు. అప్పటివరకు బస్సులో బాణసంచా లేదని చెప్పలేమన్నారు.
 
 ఇద్దరు ఐఏఎస్ అధికారులతో కమిటీ: బస్సు ప్రమాదంపై విచారణకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డిలు ఇందులో సభ్యులు. ఇప్పటికే నియమించిన రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రసాదరావుకు ఐఏఎస్ అధికారుల కమిటీకి సహకరించే బాధ్యతను అప్పగించింది. ప్రమాదానికి కారణాలతోపాటు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను పేర్కొంటూ ఈ కమిటీ 30 రోజుల్లో నివేదిక ఇస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement