మందు బందు | Sakshi
Sakshi News home page

మందు బందు

Published Tue, Mar 3 2015 1:05 AM

మందు బందు

నేటి నుంచి గొల్లపూడి, గుడివాడ డిపోల నుంచి మద్యం సరఫరా నిలిపివేత
2013 వరకు ఐటీ శాఖకు రూ. 77 కోట్ల  బకాయి
రెండు డిపోల్లో లక్ష కేసుల నిల్వలు ధరలకు మళ్లీ రెక్కలు


విజయవాడ : జిల్లాలో మంగళవారం నుంచి మద్యం సరఫరాకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడనుంది. బేవరేజ్‌ల ద్వారా మద్యం సరఫరా నిలిచిపోనుంది. గుడివాడ, గొల్లపూడి డిపోలు ఆదాయ పన్ను శాఖకు భారీగా బకాయిలు పడ్డాయి. వీటిని చెల్లించే వరకు విక్రయాలు నిలిపివేయాలని ఉత్తర్వులు అందడంతో మంగళవారం ఆపేస్తారు. ఫలితంగా జిల్లాలో మరో వారం రోజుల తర్వాత మద్యం కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు ఇప్పటికే మద్యం ధరలు మళ్లీ పెంచి అధిక వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఐటీ వర్సెస్ ఎక్సైజ్..

ఆదాయ పన్ను శాఖ, ఎక్సైజ్ శాఖకు మద్యం ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో కొంత వివాదం జరుగుతోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ 2013 వరకు ఐటీ శాఖకు పన్ను చెల్లించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్త బకాయి రూ. 8 వేల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖ కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు తీసుకొచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మద్యం డిపోల నుంచి సరఫరా నిలిపివేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో కూడా 2013 వరకు  రూ. 77 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో రెండు డిపోల నుంచి వైన్‌షాపులు, బార్‌లకు మద్యం నిల్వలు పంపకుండా నిలిపివేయాలని ఆదాయ పన్ను శాఖ అధికారుల నుంచి ఉత్తర్వులందాయి. ఈ క్రమంలో రెండు డిపోల మేనేజర్లకు గత శనివారం ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి.
 
రూ.15 కోట్ల నిల్వలు

విజయవాడ డివిజనల్ పరధిలోని వైన్‌షాపులు, బార్లకు గొల్లపూడి డిపో నుంచి, మచిలీపట్నం డివిజన్ పరిధిలోని వైన్ షాపులు, బార్లకు గుడివాడ డిపో నుంచి మద్యం నిల్వలు ప్రతినెలా సరఫరా చేస్తారు. జిల్లాలోని షాపులకు మాత్రమే రెండు డిపోల ద్వారా సరఫరా జరుగుతుంది. ఈనెలకు సంబంధించి స్టాక్‌ను గతనెల 21 నుంచే వ్యాపారులు కొనుగోలు చేశారు. జిల్లా కోటా  2.3 లక్షల కేసుల మద్యం విక్రయాలు ఇప్పటికే పూర్తికావడంతో సరఫరా చేసేశారు. జిల్లాలో నెలకు రూ.100 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరుగుతాయి. వీటిలో 2.2 లక్షల కేసులు మద్యం కాగా, లక్ష కేసుల బీరు అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలోని రెండు డిపోల్లో కేవలం లక్ష కేసుల మద్యం నిల్వలే ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.15 కోట్లుగా ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వచ్చే వరకు డిపోల నుంచి పంపిణీ నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement