డీఎస్సీ-14లో నకిలీ వినికిడిలోప ధ్రువపత్రాలు? | Sakshi
Sakshi News home page

డీఎస్సీ-14లో నకిలీ వినికిడిలోప ధ్రువపత్రాలు?

Published Sat, Mar 12 2016 1:32 AM

DSC -14 in hearing of fake certificates of error?

* అనర్హులుగా ముగ్గురు అభ్యర్థులు
* జాడ లేని అయిదుగురు అభ్యర్థులు
* రిమ్స్ ధ్రువపత్రాలపై అనుమానాలు?
* వచ్చే విద్యా సంవత్సరంలోనే డీఎసీ నియామకాలు?

శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం నిర్వహించిన డీఎస్సీ-14 లో జిల్లా నుంచి వినికిడి లోప వికలాంగ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు నకిలీవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎస్‌జీటీ, పండిట్ పోస్టులు భర్తీ చేయాలని యోచిస్తూ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. వికలాంగ ధ్రువపత్రాలను పరిశీలన నిమిత్తం విశాఖపట్నం, హైదరాబాద్ పంపించగా ఆ ధ్రువపత్రాలు నకిలీవని వెల్లడవుతోంది.

జిల్లా నుంచి 8 మంది అభ్యర్థులు వికలాంగ కేటగిరీ నుంచి ఎంపిక కాగా వారందరినీ పరిశీలన నిమిత్తం పంపించారు. వీరిలో ముగ్గురు మాత్రమే వెనక్కు వచ్చి ఆయా ఆస్పత్రులు జారీ చేసిన ధ్రువపత్రాలను జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించారు. ఆ మూడు ధ్రువపత్రాల్లో అంగవైకల్య శాతం తక్కువగా ఉండడంతో ముగ్గురినీ అనర్హులుగా డీఈఓ గుర్తించారు. మిగిలిన అరుుదుగురు అభ్యర్థుల జాడ ఇప్పటికీ లేకపోవడంతో అధికారులు వారి ధ్రువపత్రాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ ధ్రువపత్రాలను సమర్పించిన ఈ అయిదుగురు రిఫరల్ ఆస్పత్రులకు పరిశీలన నిమిత్తం వెళ్లి ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎనిమిది పోస్టులు బ్యాక్‌లాగ్‌గా ఉండిపోయే పరిస్థితి ఉంది. వినికిడి లోప వికలాంగులు అర్హత సాధించినవారిలో మిగిలి ఉండకపోవడమే దీనికి కారణం.
 
రిమ్స్‌పై అనుమానాలు?
ఇదిలా ఉంటే రిఫల్ ఆస్పత్రుల్లో అంగవైకల్య శాతం తక్కువగా ధ్రువీకరిస్తుండడంతో రిమ్స్‌లో జారీ అవుతున్న వికలాంగ ధ్రువపత్రాలలోని డొల్లతనం బట్టబయలవుతోంది. రిమ్స్ నుంచి జారీ అవుతున్న వికలాంగ ధ్రువీకరణ పత్రాలపై ఏనాటి నుంచో అనుమానాలున్నాయి. అటువంటి అనుమానాలకు ప్రస్తుత పరిస్థితి బలాన్ని చేకూరుస్తోంది.
 
వచ్చే విద్యా సంవత్సరంలోనే డీఎస్సీ నియామకాలు?
 డీఎస్సీ-14లో ఎస్‌జీటీ, పండిట్ పోస్టుల భర్తీ చేపడతామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మార్చి 5 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చే యాల్సి ఉన్నా అది అమలు కాలేదు. వికలాంగ ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో జాప్యం జరగడం వల్ల భర్తీలు చేయలేదని చెబుతున్నా అది వాస్తవం కాదన్న వాదన వినిపిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలోనే భర్తీలు చేయాలని ఆర్థిక శాఖ ప్రభుత్వానికి సూచించినట్టు భోగట్టా.

ఇప్పుడు ప్రక్రియను ప్రారంభించినా ఏప్రిల్ మొదటివారం వరకు ఇది కొనసాగే పరిస్థితి ఉంటుందని, ఏప్రిల్ 23 నుంచి పాఠశాలలకు సెలవులు కావడంతో అప్పుడు కూడా వీరందరికీ జీతభత్యాల కోసం సుమారు రూ.100 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని ఆర్థికశాఖ లెక్కలు కట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ మొత్తాన్ని ఆదా చేసేందుకు గాను జూన్ నెలలో భర్తీలు చేపట్టాలని సమాలోచనలు చేస్తున్నట్టు తెలియవచ్చింది.

అప్పటికీ పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కోర్టు తీర్పు కూడా వెలువడితే పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయవచ్చని కూడా రాష్ట్ర అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా డీఎస్సీ భర్తీల్లో జాప్యం జరుగుతుందనడంలో మాత్రం సందేహం లేదు.
 
వికలాంగ కేటగిరీలో అనర్హులు వాస్తవమే
వినికిడి లోపం కలిగిన వికలాంగ కేటగిరీలో ఇప్పటివరకు ముగ్గురు అభ్యర్థులు రిఫరల్ ఆస్పత్రులకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని డీఈఓ దేవానంద రెడ్డి చెప్పారు. వీరు ముగ్గురి అంగవైకల్య శాతం తక్కువగా ఉండడంతో అనర్హులుగా నిర్దారించడం వాస్తవమేనన్నారు. మిగిలిన అరుుదుగురు ఇప్పటివరకు రాకపోవడంతో వారు సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవి కావడం వల్ల పరిశీలనకు ఆస్పత్రులకు వెళ్లి ఉండకపోవచ్చని భావిస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement