డీఎస్సీ మార్కుల్లో భారీ తేడా ? | Sakshi
Sakshi News home page

డీఎస్సీ మార్కుల్లో భారీ తేడా ?

Published Fri, Jun 5 2015 1:25 AM

DSC marks a huge difference

 శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో అభ్యర్థుల మార్కుల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అభ్యర్థులు గడచిన రెండురోజులుగా డీఈవో కార్యాలయానికి వస్తున్నా సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తుది కీ పై అభ్యంతరాలను పరిశీలించకుండానే ఫలితాలు వెల్లడించాలని ప్రభుత్వం యోచించ గా అభ్యర్థుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి గత ఆదివారం ఉదయం అభ్యంతరాలను పరిశీలన జరిపినట్లు ప్రకటించి అదే రోజు సాయంత్రం తుది కీ విడుదల చేసింది. సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడించింది. చివరగా విడుదల చేసిన కీ ద్వారా పొందిన మార్కులకు, ఫలితాల్లో అభ్యర్థుల మార్కులకు పొంతన లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
 
 బుదవారం ఎస్‌జీటీ విభాగానికి చెందిన ఓ మహిళా అభ్యర్థి డీఈవో కార్యాలయానికి వచ్చి తుది కీ ద్వారా 120 మార్కులు పొందానని ఫలితాల్లో 106 మార్కులు మాత్రమే వచ్చాయని తెలిపారు. గురువారం హిందీ, తెలుగు, సాంఘిక శాస్త్రం విభాగాలకు చెందిన పలువురు వచ్చి తమకు మార్కుల్లో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఈ సారి డీఎస్‌సీ అభ్యర్ధులకు ఓఎంఆర్ షీట్ల నకళ్లను పరిశీలన నిమిత్తం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో దాని గురించి ఆరా తీశారు. దీనిపై డీఈవో కార్యాలయంలో కూడా స్పష్టత కరువైంది. నకలు అసలు ఇస్తారో లేదో తెలియడంలేదు. ఒక్కో అభ్యర్థి ఏడు నుంచి పదహారు మార్కుల వరకు వత్యాసాలు ఉన్నాయని చెబుతున్నారు.
 
  ఓఎంఆర్ షీట్లు ఇస్తే జరిగిన అక్రమాలు, పొరపాట్లు బయటపడతాయని భావించే ప్రభుత్వ పెద్దలు ఇలా చేస్తున్నారన్న ఆక్షేపణలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ మాల్‌ప్రాక్టీస్ చేస్తూ నమోదు కావడం, పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి ఇంట్లో నగదు తో పాటు డీఎస్‌సీ హాల్‌టిక్కట్లు, అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలు దొరకడంతో డీఎస్‌సీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు మరింత ఊతం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో డీఎస్సీ రద్దు చేస్తే ప్రభుత్వ పరువు పోవడంతోపాటు, పెద్ద ఎత్తున మరోసారి అక్రమాలు చేయించలేమని భావించి కొందరు పెద్దలు కొందరు ప్రజాప్రతినిధులు ఆగమేఘాలపై పోస్టుల భర్తీ చేయించాలని చూస్తున్నారని తెలుస్తోంది. పొరపాట్లను సరిచేయకుండా భర్తీ చేస్తే తమకు రావల్సిన అవకాశం చేజారిపోతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
 
 తుది కీ ప్రకారం మార్కులను సరిచేస్తే అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులు 15 మార్కులకు పైగా కోల్పోతారని అందువల్లనే తుది కీ ప్రకారం మార్కులను సరిచేయలేదన్న మరో వాదన కూడా ఉంది. ఏది ఏమైనా మార్కులను సరిచేయకుంటే అభ్యర్థుల తలరాతలు తారుమారవుతాయనడంలో సందేహం లేదు. విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా కొందరు అభ్యర్థులు తమ కార్యాలయానికి వస్తుండడం నిజమేనన్నారు. అయితే మార్కులలో తేడాలు ఉన్నాయో లేదో గుర్తించడం జిల్లా స్థాయిలో సాద్యం కాదని చెప్పారు. ఓఎంఆర్ షీట్లు నకలు ఇస్తారన్నదానిపై తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement