విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో రైల్వేకు దెబ్బ | Sakshi
Sakshi News home page

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో రైల్వేకు దెబ్బ

Published Tue, Aug 19 2014 4:09 AM

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో రైల్వేకు దెబ్బ - Sakshi

గుత్తి /గుంతకల్లు టౌన్ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే రైల్వే వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ (ఎస్‌సీఆర్‌ఎంయూ) ఆందోళన వ్యక్తం చేసింది. రైల్వేలో 50 శాతం వరకు ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్‌సీఆర్‌ఎంయూ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు సోమవారం గుత్తి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం-2, గుంతకల్లు రైల్వేస్టేషన్ బిల్డింగ్ ఎదుట ధర్నా చేశారు. గుత్తిలో యూనియన్ చైర్మన్ నారాయణ, సెక్రటరీ రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ కంపెనీలు రైల్వేలో లాభాలు వచ్చే విభాగాల్లో మాత్రమే ప్రవేశిస్తాయన్నారు.
 
నష్టాలు ఉన్న విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావన్నారు. దీంతో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఉద్యోగులను కూడా తగ్గించి.. ఉన్న వారిపై పనిభారం పెంచుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే క్యాటరింగ్, ప్లాట్‌ఫాం క్లీనింగ్, శానిటరీ, ఆస్పత్రులు, పార్శిల్, డీజిల్ షెడ్‌లోని కొన్ని విభాగాలను ప్రైవేటీకరించారన్నారు. రైల్వేను దశల వారీగా ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేలో ఎఫ్‌డీఐలను అనుమతించకుండా కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
 
ప్రైవేట్ కంపెనీలను పోషించేందుకే..
గుంతకల్లులో యూనియన్ డివిజన్ అధ్యక్షుడు ఫళనీస్వామి మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీలను పెంచిపోషించేందుకే రైల్వే మంత్రిత్వ శాఖ యాత్రీ టికెట్ సువిధాన్ కేంద్రా(వైటీఎస్‌కే)లను ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు. ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రయాణికులపై అధికభారాన్ని మోపడమే కాకుండా ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పొట్టకొట్టేందుకు కుట్ర పన్నిందని నిప్పులు చెరిగారు. ప్రయాణికుల సంక్షేమాన్ని కోరుకునే వారైతే రైల్వేస్టేషన్‌కి మినరల్ వాటర్ సరఫరా చేసే వీలున్నా ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నించారు. వాటర్ బాటిల్స్ విక్రయించే కంపెనీల నుంచి అధికారులకి ముడుపులు ముట్టవనే ఒకే కారణంతో రైలు ప్రయాణికులకి శుద్ధమైన నీటిని అందించడం లేదని ఆరోపించారు.
 
రైల్వే రిజర్వేషన్, రైల్వే టిక్కెట్ బుకింగ్ సిస్టమ్ ప్రవేటీకరణను రద్దు చేయకపోతే  జాతీయ స్థాయిలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. గుత్తి ధర్నాలో యూనియన్ కోశాధికారి లాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రన్న, ఆంజనేయ, నాగరాజు, ప్రసాదరావు, అసిస్టెంట్ సెక్రెటరీలు త్యాగరాజు, లక్ష్మన్న, రంగనాయకులు, రాజేంద్రప్రసాద్‌రెడ్డి, వందలాది మంది రైల్వే కార్మికులు పాల్గొన్నారు. గుంతకల్లులో యూనియన్ ఉపాధ్యక్షుడు ఎం.డి.గౌస్, కోశాధికారి ప్రకాష్‌బాబు, నాయకులు మస్తాన్‌వలి, జాఫర్, వందలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement