రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించండి.. | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించండి..

Published Tue, Mar 17 2015 3:40 AM

రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించండి.. - Sakshi

 టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తికమక
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర సోమవారం శాసనసభలో తికమక పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించాలని ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేశారు. సభలో నవ్వులు వినిపించడంతో.. సర్దుకొని.. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించవద్దని చెప్పారు. నదుల అనుసంధానంపై 344 నిబంధన కింద చేపట్టిన చర్చను సోమవారం ఆయన ప్రారంభించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గిపోయిందని, దీనివల్ల పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తుందన్నారు. మిగుల జలాల ఆధారంగా ఎన్టీఆర్ ప్రాజెక్టులు చేపడితే.. నికర జలాలు కావాలని రాయలసీమ నేతలు గొడవ చేసి ప్రాజెక్టులను అడ్డుకోడానికి ప్రయత్నించారని విమర్శించారు. మిగులు జలాల మీద హక్కు కోరబోమని కాంగ్రెస్ పాలకులు బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించారని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టులో బాబు ప్రభుత్వం చేసిన వాదన వల్లే అలా చేయాల్సి వచ్చిందని సభ్యులు వ్యాఖ్యానించినప్పుడు.. విననట్లుగా ముసిముసి నవ్వులు నవ్వారు. గోదావరిలో వృథాగా పోతున్న 3 వేల టీఎంసీల నీటి నుంచి కొంత భాగాన్ని కృష్ణాకు తరలించి, అక్కడ మిగిలే నీటిని రాయలసీమకు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన విషయాన్ని విపక్ష సభ్యులు గుర్తు చేయగా.. తాను నిపుణుల కమిటీ వేయాలని మాత్రమే డిమాండ్ చేశానని  తప్పించుకున్నారు. పట్టిసీమ వల్ల గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుందంటూ.. రైతుల్లో భయాందోళనలు కలిగిస్తోందని విపక్ష ంపై మండిపడ్డారు. నదుల అనుసంధానానికి కలసి రావాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement