నకిలీ.. సాల్వెన్సీ మకిలి | Sakshi
Sakshi News home page

నకిలీ.. సాల్వెన్సీ మకిలి

Published Thu, Feb 27 2014 12:29 AM

Duplicate Salvensi in Bhimavaram

భీమవరం క్రైం, న్యూస్‌లైన్:‘నేరం చేసినవాడు ఏ రాష్ట్రం వాడైనా పరవాలేదు. వేరే దేశం వాడైనా సమస్య రాదు. వాళ్లకు ఆస్తిపాస్తులేమీ లేకపోయినా ఇబ్బంది లేదు. చిటికెలో సాల్వెన్సీలు సృష్టించేస్తాం. ఇట్టే బెయిల్ పుట్టించేస్తాం’ అంటూ కొందరు వ్య క్తులు నకిలీ సాల్వెన్సీల రాకెట్ నడుపుతున్నారు. కొందరు పంచాయతీ కార్యదర్శుల అండదండలతో జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. డెల్టా ప్రాం తంలో వేళ్లూనుకుపోయిన ఇలాంటి వ్యవహారాలు ఇటీవల కొన్ని వెలుగులోకి వచ్చాయి. నకిలీ కరెన్సీ చలామణి వ్యవహారాల్లో అరెస్ట్ అయిన ఇతర దేశాలు, రాష్ట్రాలకు చెందిన ముఠాలను బెయిల్‌పై విడుదల చేయించేందుకు కొందరు వ్యక్తులు నకిలీ సాల్వెన్సీలను సమర్పించి కోర్టులను మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ నిమిత్తం కొన్ని పంచాయతీలకు చెందిన అధికారుల పోర్జరీ సంతకాలతో కూడిన సాల్వెన్సీలను సమర్పించిన విషయం ఇటీవల కోర్టు జోక్యంతో వెలుగులోకి వచ్చింది.
 
 ఈవోపీఆర్‌డీ, ఆర్‌డీ సంతకాలను ఫోర్జ రీ చేసి వీరవాసరం మండలం బాలేపల్లి పంచాయతీ కార్యాలయం నుంచి నకిలీ సాల్వెన్సీలను పుట్టించి భీమవరంలోని ఒక కోర్టుకు ఓ నిందితుడి బెయిల్ నిమిత్తం దరఖాస్తు చేసిన వైనం వెలుగుచూసింది. సమర్పించిన సాల్వెన్సీలు నకిలీవని భావించిన మేజిస్ట్రేట్ దీనిపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. నకిలీ వ్యవహారం నిగ్గు తేలడంతో వాటిని సృష్టించిన బాలేపల్లి పార్ట్‌టైం ఉద్యోగి చాబత్తుల రవికుమార్, మరొకరిని ఈనెల మొదటి వారంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇదే తరహాలో మత్స్యపురిపాలెం పంచాయతీ నుంచి ఇచ్చిన మరొక సాల్వెన్సీ కూడా నకిలీదని తేలడంతో మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఇందుకు బాధ్యుడిగా భావిస్తున్న పంచాయతీ కాంట్రాక్ట్ కార్యదర్శిని భీమవరం టూటౌన్ పోలీసులు విచారిస్తున్నారు. 
 
 ఇబ్బడిముబ్బడిగా ఇచ్చేస్తున్నారు
 ప్రభుత్వ కార్యాలయం నుంచి ఏదైనా అధికారిక వర్తమానం లేదా ప్రొసీడింగ్స్ విడుదలయ్యేప్పుడు సంబంధిత కార్యాలయ ప్రధానాధికారి సంతకంతోపాటు.. కౌంటర్ సిగ్నేచర్‌లు ఉంటాయి. ఇదంతా విధానపరంగా ఉంటుంది. అనంతరం ఆ ప్రతి దరఖాస్తుదారుకు ముట్టినట్టుగా సంబంధిత వ్యక్తితో సంతకం చేయించుకుని కాపీని విడుదల చేస్తారు. కానీ.. నకిలీ సాల్వెన్సీల విషయంలో అలాంటి తంతు ఏమీ జరగడంలేదు. ఈవోపీఆర్‌డీ, ఆర్డీల సంతకాలను ఫోర్జరీ చేసి సాల్వెన్సీలను విడుదల చేస్తున్నారు. కొందరు దళారులు ఎక్కడికక్కడ ఈ తరహా రాకెట్లు నడుపుతున్నారు. సాల్వెన్సీలు ఇచ్చే సందర్భంలో డిమాండ్‌ను బట్టి ఒక్కొక్క దానికి రూ.50 వేల వరకు దళారులు ముట్టచెబుతున్నట్టు సమాచారం. వారి ఉచ్చులో పడుతున్న కొందరు కాం ట్రాక్ట్ కార్యదర్శులు వెనుకాముందు ఆలోచించకుండా పై అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ సాల్వెన్సీలను ఎడాపెడా ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికమయ్యూయని పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు చెందిన పాలా రాఘవేంద్రరావు అనే వ్యక్తి జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశాడు. మత్స్యపురి గ్రామ పంచాయతీ నుంచి నకిలీ సాల్వెన్సీలు విడుదల అయ్యూయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
 

Advertisement
Advertisement