ఎక్కడి చెత్త.. అక్కడే.. | Sakshi
Sakshi News home page

ఎక్కడి చెత్త.. అక్కడే..

Published Sun, Jul 12 2015 2:35 AM

dust

 కడప కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల సమ్మెతో కడప నగరపాలక సంస్థతోపాటు, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం పడకేసింది. ముఖ్యంగా 3.50 లక్షల జనాభా ఉన్న కడప నగరంలో రెండు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దుమ్ము, ధూళితో   రహదారులన్నీ మట్టికొట్టుకుపోయాయి. శనివారం అర్ధరాత్రి నుంచి వాటర్ వర్క్స్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని చెబుతున్నారు. అదే జరిగితే ఆదివారం నుంచి తాగునీటి సరఫరాకు ఆటం కం కలగనుంది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 15,432 ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో సుమారు 8 నెలలుగా కార్మికులు వివిధ రూపాల్లో సమ్మె చేస్తున్నా ప్రభుత్వం చలించకపోవడంతో ఈనెల 7వ తేది అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు.
 
 కార్మికులు సమ్మెబాట పట్టినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలైనా చేపట్టాలి లేదా కార్మికుల డిమాండ్లను పరిష్కరించి సమ్మెలోకి వెళ్లకుండా నివారించగలగాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్య లు చేపట్టినట్లు కనిపించడం లేదు. కార్మిక నాయకులతో చర్చలు జరిపి సమ్మెను నివారించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించినప్పటికీ ఆ ఆదేశాలు అమలుకాలేదు.
 
 ముఖ్యంగా కడప నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించే కమిషనర్‌గానీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గానీ, శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. అందరూ పుష్కరాలకు వెళ్లడంతో కార్మికుల సమస్యలు వినే నాథుడుగానీ, వారికి జవాబు చెప్పేవారు కానీ కరువయ్యారు. ముఖ్యంగా కార్మికులంతా సమ్మెలోకి వెళ్లినా పై అధికారులు ఉండి ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నగరాన్ని కొంతమేరకైనా శుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషించేవారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుం టారో వేచిచూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement