ముగిసిన ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Published Sun, Aug 24 2014 3:08 AM

EAMCET certificates verifications concluded

 తెలంగాణలో 56,042 మంది, ఏపీలో 65,667 మంది హాజరు
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీలో, 14 నుంచి తెలంగాణలో చేపట్టిన వెరిఫికేషన్‌కు 1,21,709 మంది విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకున్నట్లు ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వెరిఫికేషన్‌కు ఫస్ట్ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు 1,14,508 మందిని పిలువగా, శనివారం సాయంత్రం 7 గంటల వరకు 65,667 మంది వెరిఫికేషన్ చేయించకున్నట్లు వివరించారు. తెలంగాణలో 88,947 మందిని పిలిస్తే 56,042 మంది హాజరయ్యారని వివరించారు.

వెబ్ ఆప్షన్లు ప్రారంభమైన ఈ నెల 17వ తేదీ నుంచి శనివారం రాత్రి 7 గంటల వరకు 87,859 మంది అప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో 1,00,001వ ర్యాంకు నుంచి 1,50,000 ర్యాంకు పరిధిలోని 28,518 మంది విద్యార్థులకు అప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించగా 26,827 మంది విద్యార్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. ఈ ర్యాంకు పరిధిలోని వారు వెబ్ ఆప్షన్లను ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఇచ్చుకోవచ్చని వివరించారు. ఈ నెల 25తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియనుంది. 26, 27 తేదీల్లో ఆప్షన్లను మార్చుకునే అవకాశం కల్పించనున్నారు.
 

Advertisement
Advertisement