వర్సిటీలను కలుపుతూ ఏపీలో ఎడ్యూ గ్రిడ్ | Sakshi
Sakshi News home page

వర్సిటీలను కలుపుతూ ఏపీలో ఎడ్యూ గ్రిడ్

Published Wed, Feb 24 2016 12:33 AM

Edu grid connecting the university in AP

విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను కలుపుతూ ఎడ్యు గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నగరంలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు మంగళవారం విద్యారంగంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8,924 అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేస్తే 4,500 ప్రాంగణాల్లో ఇంకా పనులు ప్రారంభం కాలేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై ఫ్రీ స్కూళ్లుగా రూపాంతరం చెందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అన్ని కేంద్రాలకు ఫ్యాన్లు, విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. సొంత భవనాలు లేని కేంద్రాలపై అద్దె భారం లేకుండా ఇకపై ప్రభుత్వ పాఠశాల భవనాల్లో వాటిని నిర్వహించాలని సూచించారు. జనవరి నుంచి అన్ని రకాల ఉపకార వేతనాలను నెలవారీగా చెల్లిస్తున్నామన్నారు. నాలుగేళ్లలో సంక్షేమ హాస్టళ్లలన్నింటినీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో సామాజికవర్గాల గణనపై దృష్టిపెట్టాలని సూచించి ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కోసం 11లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈ సంవత్సరం 90 వేల మందికి శిక్షణ ఇచ్చామని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో గంటా సుబ్బారావు తెలిపారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండున్నర లక్షల మందికి శిక్షణ ఇస్తామన్నారు. ప్రధాన దేవాలయాలున్న నగరాలు, పట్టణాల్లో గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. కృష్ణా పుష్కరాలను పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయించామని, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు రాబోయే రోజుల్లో కృష్ణా జలాలు అందించనున్న దృష్ట్యా అక్కడి ప్రజలను కూడా పుష్కరాల్లో భాగస్వాముల్ని చేయాలని చెప్పారు. విశాఖపట్నంలో హెల్త్ ఎక్విప్‌మెంట్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. అధికారులు చాలాచోట్ల ఇచ్చిన ట్యాబ్‌లను వాడడం లేదన్నారు. దీర్ఘకాలిక సెలవు పెట్టి ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యం చూపే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సర్వీసుల నుంచి తొలగించాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కొరికి చిన్నారి మృతి చెందిన తర్వాత పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డానని తెలిపారు. వైద్యులు, సిబ్బంది ఇచ్చిన భరోసాతో వెనక్కు తగ్గానని, ఆ తర్వాత ప్రభుతాస్పత్రిలో చాలా మార్పు వచ్చిందన్నారు.

చివర్లో ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టరలతో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి జరుగుతున్న దశలో అశాంతి రేపడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయని, వాటిని చాకచక్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. యూనివర్సిటీలను నిఘా కెమెరాల ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించాలని సూచించారు. నిఘా కెమెరాలతో నేర నియంత్రణ చేయాలని, ఆధారాలు దొరుకుతాయనే భయం ఉంటే నేరాలు జరగవన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని నేర నియంత్రణ అమలుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడంలో కలెక్టర్లు సహకరించాలని డీజీపీ జేవీ రాముడు కోరారు. మంగళవారం రాత్రి వరకూ సమావేశం జరిగింది.

Advertisement
Advertisement