చదువుకొనాల్సిందే! | Sakshi
Sakshi News home page

చదువుకొనాల్సిందే!

Published Mon, Jun 2 2014 2:36 AM

చదువుకొనాల్సిందే!

అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డుకు చెందిన నరసింహులు ఆటో డ్రైవర్. ఈయన కుమారుడు సురేష్ ఐదో తరగతి పూర్తి చేసుకున్నాడు. ఆరో తరగతిలో చేరాల్సి ఉంది. ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలు చాలామంది కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఎన్ని ఇబ్బందులు పడినా... కొడుకుకు బంగారు భవిష్యత్తు ఉండాలనే ఆశతో నరసింహులు కూడా ఓ కార్పొరేట్ పాఠశాలకు వెళ్లాడు. ఆరో తరగతి ప్రవేశానికి అక్షరాలా రూ. 45 వేలు (డేస్కాలర్) ఫీజు. పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, స్టడీ మెటీరియల్  అదనం’.  విధిలేని పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు.  
 
 రాప్తాడు మండలానికి చెం దిన రైతు కదిరిప్ప కుమారుడు పవన్ పదో తరగతి పూర్తి చేసుకుని ఓ కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలలలో చేరాడు. ఫీజు  రూ. 47 వేలు. పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఇతరత్రా ఖర్చులు అదనం. అసలే వర్షాలు అంతంతమాత్రంగా కురుస్తున్నాయి. పంటలు చేతికిరాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అప్పులు చేసి కొడుకుకు ఫీజు చెల్లించాల్సి వస్తోందని కదిరిప్ప పేర్కొన్నాడు.  
 
 అనంతపురం
 ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :   బడులు మరో 10 రోజుల్లో తెరుచుకోనున్నాయి. దీంతో తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. జూన్ పేరు వింటేనే హడలిపోయేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారు, తమ పిల్లల ఫీజులు, పుస్తకాలు, డ్రస్సులు తదితర కొనుగోలు విషయాల్లో ఆందోళనతో ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రులు చదువుల ఖర్చు గురించి లెక్కలేసుకుంటున్నారు.
 
 ప్రభుత్వ విద్యపై నమ్మకం లేక...
 ఏడాదికేడాదికీ ప్రైవేట్ పాఠశాలల్లో ఏదో కొత్తదనమంటూ ఫీజులు పెంచేస్తున్నారు. పాఠశాలల మధ్య ఎంత పోటీ ఏర్పడుతున్నా...ఫీజుల విషయంలో అందరూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం, ఉపాధ్యాయుల కొరత తదితర కారణాలతో పాటు కొందరు ఉపాధ్యాయులు తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో దురభిప్రాయం ఉంది. ప్రభుత్వ విద్యపై నమ్మకం లేక...పిల్లలకు సరైన విద్యా సంస్థల్లో చేర్పించకపోతే వారి భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోననే భయంతో అప్పులు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కార్పొరేట్ విద్యపై ఉన్న మక్కువతో వీరు అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్నారు. దిగువ, మధ్య తరగతి ప్రజలందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
 
 బడ్జెట్ తడిసి మోపెడు
 జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ మాసం అంటే భయపడే పరిస్థితులు దాపురించాయి. ఈ మాసం పిల్లల తల్లిదండ్రులకు చదివింపులు, అప్పులమాసంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.  కొందరు ముందస్తు ప్రణాళికతో గతంలో వేసిన చీటీలను ఈ నెలలో ఎత్తేసి ఫీజులు చెల్లిస్తున్నారు. మరికొందరు బంగారు నగలు తాకట్టు పెడుతున్నారు. ఓ కుటుంబంలో ఇద్దరు పిల్లలు కార్పొరేట్ స్కూల్‌లో చదువుతుంటే చాలు...వారి జూన్ నెల ఖర్చు రూ. 60 వేలు పైమాటే. ఒలంపియాడ్, ఎయిర్ కండిషన్ ఉన్న స్కూళ్లయితే ఈ ఖర్చు ఇంకా పెరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతుంటే సుమారు రూ. 30 వేలదాకా ఖర్చవుతోంది. పిల్లల స్కూలు ఫీజులతో పాటు ఇతర ఖర్చులు కూడా బోలెడు ఉన్నాయి. కనీసం రెండుమూడు జతల యూనిఫాం, టైలర్ ఖర్చు, పుస్తకాలు, షూలు కొనాల్సి ఉంటుంది. ఫీజులతో పాటు వీటన్నిటి ఖర్చులు లెక్కిస్తే సగటు దిగువ మధ్యతరగతి కుటుంబ జూన్ బడ్జెట్ తడిసి మోపెడు కానుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement