శిరీష చనిపోయింది | Sakshi
Sakshi News home page

శిరీష చనిపోయింది

Published Wed, Jun 4 2014 5:00 PM

శిరీష చనిపోయింది

విజయవాడ: కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించని భర్త వైఖరితో మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఈపూరి శిరీష చనిపోయింది. దాదాపు 85 శాతం మేర కాలిన శరీరంతో మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచింది. కృష్ణా జిల్లా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు..

మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన పరసా అనుపమ్‌కుమార్(28)కు, అదే ప్రాంతానికి చెందిన ఈపూరి శిరీషతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 8 నెలల పాప ఉంది. అనుపమ్ ఆటోనగర్‌లో స్టీల్ ఫౌండ్రీ నడుపుతుంటాడు. అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో పాటు కుటుంబ విషయాల్లో బాధ్యతగా వ్యవహరించడం లేదంటూ శిరీష కొద్దికాలంగా అతడితో గొడవపడుతుండేది. సోమవారం రాత్రి పూటుగా మద్యం తాగి వచ్చిన అనుపమ్ భార్యతో గొడవకు దిగాడు. దీంతో శిరీష పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరించింది.

మాటామాటా పెరగడంతో మనస్తాపం చెందిన శిరీష ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో అనుపమ్ కంగారుగా మంటలను ఆర్పి.. ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాచవరం పోలీసులు మంగళవారం వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్న మేజిస్ట్రేట్ బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. భర్తతో గొడవపడిన తాను అతడ్ని బెదిరించేందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె తన వాంగ్మూలంలో తెలియజేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

కాగా, ‘మా అమ్మాయి అందంగా లేదని పరాయి మహిళతో సంబంధాలు కొనసాగిస్తూ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్న అల్లుడే ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేశా’డని శిరీష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముమ్మాటికి ఇది హత్యాయత్నమేనని, తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని వారు అంటున్నారు. ఈ మేరకు శిరీష బంధువులు ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా, తనను బెదిరించేందుకు శిరీష ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడితే తాను మంటలు ఆర్పేందుకు వెళ్లానని, ఆ సమయంలో చేతులకు గాయాలయినట్లు అనుపమ్‌కుమార్ పోలీసులకు తెలిపారు.

అయితే తన కూతురిని చంపేస్తానని భర్త బెదిరించడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు శిరీష నిన్న వాంగూల్మం ఇచ్చిందని చెబుతున్నారు. నేడు మళ్లీ వాంగూల్మం ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని వెల్లడించిందని సమాచారం. దీంతో శిరీష భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇంకా ఏమైనావుంటే మేజిస్ట్రేట్ ముందు చెప్పాలని శిరీష బంధువులకు సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement