Sakshi News home page

టెన్షన్ పెట్టినా...సెట్ చేశారు

Published Sat, May 9 2015 3:11 AM

టెన్షన్ పెట్టినా...సెట్ చేశారు - Sakshi

44 కేంద్రాల పరిధిలో 95 శాతం హాజరు నమోదు
సత్ఫలితాలిచ్చిన అధికారులు,పోలీస్ శాఖ, విద్యాసంస్థల కృషి
విద్యాలయాల బస్సులు,పోలీస్ వాహనాలు, ఆర్టీసీ అద్దె బస్సుల్లో విద్యార్థుల తరలింపు
విజయవంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం

 
 గుంటూరు ఎడ్యుకేషన్ : ఆర్టీసీ సమ్మె టెన్షన్ పెట్టినా...జిల్లా అధికారయంత్రాంగం, పోలీస్ శాఖ, విద్యాసంస్థల యాజమాన్యాల కృషి ఫలితంగా ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. గుంటూరు నగరంతో పాటు నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 44  కేంద్రాల పరిధిలో 95 శాతం హాజరు నమోదైంది. శుక్రవారం నిర్వహించిన ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష...ఎంసెట్-2015కు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆందోళన పడ్డారు.

ఓ వైపు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమన్న అధికారుల ప్రకటన, మరోవైపు ఆర్టీసీ సమ్మె కారణంగా సకాలంలో చేరుకుంటామో లేదో అని విద్యార్థులు ఆందోళన చెందినా అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు చేసిన ఏర్పాట్లతో సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.ఉదయం 38 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 19,878 మంది విద్యార్థుల్లో 19,020 మంది హాజరయ్యారు. 95.68 శాతం హాజరు నమోదైంది.

మధ్యాహ్నం జరిగిన మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 7,739 మంది విద్యార్థుల్లో 7,326 మంది హాజరుకాగా, 94.66 శాతం హాజరు నమోదైంది.ఆర్టీసీ సమ్మె కారణంగా, జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు గురువారం అర్ధరాత్రికి నగరానికి చేరుకుని బస్టాండ్ ప్రాంగణంలోనే నిదురించారు. జిల్లా అధికార యంత్రాం గం చేసిన ఏర్పాట్లతో ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు, విద్యాసంస్థల బస్సుల్లో విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేర్చారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు స్వయంగా విద్యార్థులను ఆర్టీసీ అద్దెబస్సుల్లోకి ఎక్కించి పంపారు.

హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా సేవలు ...
 ఎంసెట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో సహాయపడేందుకు పోలీసుశాఖ నగరం లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాలు ప్రశంసనీయ రీతిలో సేవలు అందించాయి. పోలీసు సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు సూచనలు ఇవ్వడంతో పాటు దగ్గరుండి బస్సులు ఎక్కించారు.

పరీక్షలు ముగియడంతో స్వస్థలాలకు పయనం ...
 రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి గుంటూరులోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఎంసెట్ ముగియడంతో హాస్టళ్లను ఖాళీ చేసి స్వస్థలాలకు పయనమయ్యారు. సమ్మె కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అద్దె బస్సులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయాయి.

ఆర్టీసీ బస్సులతో పాటు రైళ్ల ద్వారా విద్యార్థులు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఎంసెట్ ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జిల్లా అధికార యంత్రాంగం, పోలీసుశాఖ, విద్యాసంస్థల యాజమాన్యాల సహకారంతో ఎంసెట్ విజయవంతంగా ముగి సిందని ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య పి.సిద్ధయ్య తెలిపారు.

Advertisement
Advertisement