ఏడు జిల్లాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్‌ | Sakshi
Sakshi News home page

ఏడు జిల్లాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్‌

Published Tue, Feb 26 2019 3:18 AM

Election code to be implemented in seven districts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్స్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగే ఏడు జిల్లాల్లో తక్షణం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సీఎంతో సహా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అధికారిక కార్యక్రమాలు నిర్వహించరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులను ప్రభావితం చేసే ఎటువంటి విధాన పరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్నా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లేనని పేర్కొంది.

ఈ జిల్లాల్లో మంత్రులు, సీఎంతో సహా అధికారిక వాహనాలను, ఎస్కార్ట్‌ను వినియోగించరాదని, ప్రభుత్వ అతిథి గృహాలతో పాటు ప్రభుత్వానికి చెందిన, అలాగే ఎయిడెడ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ను వినియోగించరాదని సంఘం పేర్కొంది. ఈ ఏడు జిల్లాల్లో ఎటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదని స్పష్టం చేసింది. సీఎంతో సహా మంత్రులెవరూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను పిలిచి అధికారిక సమావేశాలను నిర్వహించరాదని పేర్కొంది. ప్రభుత్వ శాఖలు కూడా ఎటువంటి కొత్త పథకాలను, కార్యక్రమాలను ప్రకటించరాదని సూచించింది. ఈ ఏడు జిల్లాల్లో మంత్రుల ప్రైవేట్‌ పర్యటనలపై నిఘా ఉంచాలని, వారి పర్యటనలను వీడియో రికార్డింగ్‌ చేయాలని జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలంది. 

Advertisement
Advertisement