‘ముంపు’ ఎన్నికలకు నోటిఫికేషన్ | Sakshi
Sakshi News home page

‘ముంపు’ ఎన్నికలకు నోటిఫికేషన్

Published Tue, Aug 5 2014 12:40 AM

election notification to Plain zones

భద్రాచలం: ఖమ్మం జిల్లా నుంచి ఏపీకి బదలాయించిన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో ఎంపీపీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ముంపు మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన ఎన్నికల కమిషన్, ఆ బాధ్యతలను ఏపీ అధికారులకే అప్పగించింది. ఈ మేరకు తూర్పుగోదావరి జెడ్పీ సీఈవో మూడు మండలాల్లో  ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తూ ఎంపీడీవోలకు లేఖలు పంపారు. తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న తాము ఎన్నికలు నిర్వహించబోమని ఆ అధికారులు తిరస్కరించారు. దీంతో ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ నేరుగా రంగంలో దిగి తమ ఆదేశాలను తిరస్కరించిన అధికారులపై గట్టిగా స్పందించారు. ఆయా అధికారులకు మరోసారి ఆదేశాలివ్వాలని, అప్పటికీ అంగీకరించకుంటే  కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు తూర్పుగోదావరి అధికారులతో ఎన్నికలు పూర్తి చేయించాలని ఆ జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

ఖమ్మం జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు నో

హైదరాబాద్: బుధ, గురు వారాల్లో జరగనున్న ఖమ్మం జిల్లా జెడ్పీ, ఎంపీపీ ఎన్నికలను నిలిపివేయడానికి సోమవారం హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే  నోటిఫికేషన్ విడుదలైనందున, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా, పెద్దగోపతికి చెందిన వి.నారాయణరావు హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
Advertisement