రాష్ట్రంలో తొలి రెండు విడతల్లోనే.. | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో తొలి రెండు విడతల్లోనే..

Published Mon, Jan 6 2014 1:26 AM

Elections will be held in two phases in Andhra Pradesh

  • అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం కసరత్తు
  •   జూన్ 2తో పూర్తికానున్న ప్రస్తుత అసెంబ్లీ గడువు
  •   ‘విభజన’ నేపథ్యంలో 3 విడతల్లో ఎన్నికలకు ఆస్కారముందంటున్న అధికారులు
  •  సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ గడువు వచ్చే జూన్ 2వ తేదీ వరకు ఉంది. గత సార్వత్రిక ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లోనే ఎన్నికలను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఎన్నికల సంఘం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ, 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అరుుతే రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో తలెత్తిన ప్రత్యేక పరిస్థితులను బేరీజు వేసుకుని అవసరమైతే రాష్ట్రంలో ఈసారి మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకూ ఆస్కారం లేకపోలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గత నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఓటర్ల నమోదుపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 16 న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది.
     
    రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు విడతల్లోనే ఎన్నికలను పూర్తి చేయాలన్న ఆలోచనతో అధికారులున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు మార్చి 3న సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశాలున్నాయి. అరుుతే ఒకటి రెండు రోజులు అటుఇటుగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చనీ తెలుస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 543 లోక్‌సభ స్థానాలకు 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు.
     
    తొలి విడతలో 164 లోక్‌సభ స్థానాలు, రెండో విడత 163, మూడో విడత 90, నాలుగోవిడత 40, ఐదో విడత 86 స్థానాలకు ఎన్నికలు జరిగారుు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి రెండు విడతల్లోనే ఎన్నికలు పూర్తయ్యాయి. తొలివిడతలో 22 లోక్‌సభ, రెండో విడత 20 లోక్‌సభ స్థానాలకు, వాటి పరిధుల్లోని అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 5.92 కోట్ల మంది ఓటర్లుండగా, జనవరి 16న ప్రకటించే తుది జాబితాలో ఈ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. 

Advertisement
Advertisement