విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో | Sakshi
Sakshi News home page

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో

Published Mon, Sep 16 2013 4:08 AM

Electric pillar, auto collision

కొమరోలు, న్యూస్‌లైన్ :రోడ్డుపక్కనున్న ఓ విద్యుత్ స్తంభాన్ని టాటాఏస్ ఆటో ఢీకొట్టిన సంఘటన మండలంలోని యర్రపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. విజయవాడకు చెందిన ఓ ఆటో సరుకుల లోడుతో కడప జిల్లా ప్రొద్దుటూరు వెళ్లింది. అక్కడ సరుకులను అన్‌లోడ్ చేసి తిరిగి విజయవాడ బయలుదేరింది. మార్గమధ్యంలోని యర్రపల్లి గ్రామంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా రోడ్డుపక్కనున్న ఓ బైక్‌ను ఆటో ఢీకొట్టింది. ఆ వెంటనే పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని కూడా ఢీకొనడంతో స్తంభం విరిగిపడింది. దానికి బిగించి ఉన్న కరెంటు తీగలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ తీగల ఒత్తిడికి అదే లైన్‌లో ఉన్న ఐదు స్తంభాలు నేలకొరిగాయి. దీనివల్ల విద్యుత్ శాఖకు 30 వేల రూపాయల నష్టం వాటిల్లింది. కాగా, ఆటోలో ప్రయాణిస్తున్న కడప జిల్లా వనిపెంట గ్రామానికి చెందిన సుంకర వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని 108లో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో గ్రామంలో ఆన్‌చేసి ఉన్న 15 టీవీలు షార్ట్‌సర్క్యూట్‌కు గురై కాలిపోయాయి. విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడటం, విద్యుత్ సరఫరా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న విద్యుత్‌శాఖ సిబ్బంది సరఫరా నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ ఎస్.సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. 
 
 చీరాలలో...
 చీరాల రూరల్, న్యూస్‌లైన్ : వేగంగా వచ్చిన ఓ గూడ్స్ ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగిపోయింది. స్థానిక పేరాల శృంగారపేటలోని చీరాల-వాడరేవు ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆ వివరాల ప్రకారం... స్థానిక పేరాల కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయ సమీపంలో గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఆదివారం ఊరేగించి నిమజ్జనానికి వాడరేవుకు తరలిస్తున్నారు. అందుకోసం రెండు వాహనాలు ఏర్పాటు చేశారు. టాటాఏస్ వాహనంలో గణనాథుడిని ముందుగా పంపారు. దాని వెనుక మరో టాటాఏస్ వాహనం బయల్దేరింది. ఈ వాహనం శృంగారపేటలో రోడ్డుపక్కనున్న ఓ విద్యుత్ స్తంభాన్ని వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపోయింది. తీగలపై ఆధారపడి రోడ్డుపై పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆటోలోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్తంభాన్ని ఢీకొట్టిన వాహనం అదే వేగంతో మళ్లీ రోడ్డుపైకి వెళ్లి నిలిచిపోయింది.
 

Advertisement
Advertisement