ఏమైతదో....ఏందో! | Sakshi
Sakshi News home page

ఏమైతదో....ఏందో!

Published Mon, Feb 24 2014 1:53 AM

ఏమైతదో....ఏందో! - Sakshi

  •     విలీనం-పొత్తుపై టెన్షన్.. టెన్షన్
  •      కాంగ్రెస్ నేతల్లో కలవరం
  •      గులాబీ నాయకుల్లోనూ గుబులు
  •      ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దు‘పాట్లు’
  •      కలిసే నడవాలంటున్న సిట్టింగ్‌లు
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధిష్టానం నెరవేర్చడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్ పెరిగింది. ఎన్నికల పోరుకు ఇన్నాళ్లు అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’... ఇప్పుడు అనుకూలంగా మారిందనే సంతోషం వారిలో నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ముందున్న టీఆర్‌ఎస్ నేతలూ ఊపు మీదున్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన ఘనత తమదేనని... ఎన్నికల్లో తమకే సానుకూలత ఉంటుందని వీరు భావిస్తున్నారు. మొత్తంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అధికార కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకుల్లో హుషారు పెరుగుతోంది.

    ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పయనంపై జరుగుతున్న ప్రచారం ఆ రెండు పార్టీల నేతలను కలవరానికి గురిచేస్తోంది. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు అంశాలు వారిలో ఆందోళన పెంచుతున్నారుు. వీటిలో ఏది జరిగినా... తమ రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుందని ఎక్కువ మంది నేతలు టెన్షన్ పడుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని సిట్టింగ్‌లు విలీనం లేదా పొత్తు... ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇరు పార్టీల  నియోజకవర్గ ఇన్‌చార్జీలు మాత్రం రెండు జరగకూడదని కోరుకుంటున్నారు.
     
    కాంగ్రెస్ నేతల్లోనే...
     
    కాంగ్రెస్ ఆశావహుల్లో ఎక్కువ మందికి రాజకీయ భవిష్యత్ ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఈ పార్టీకి మంచి ఫలితాలే వచ్చాయి. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడా లేనన్ని సీట్లు దక్కించుకుంది. వరంగల్, హన్మకొండ లోక్‌సభ... హన్మకొండ, నర్సంపేట, చేర్యాల, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ప్రతికూల ఫలితాలు వచ్చిన 2008 ఉప ఎన్నికలోనూ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకుంది.

    2009 సాధారణ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ స్థానంలోనే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న మూడు సెగ్మెంట్లలోనూ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిలుగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే ఉన్నారు.  కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైనా, పొత్తు కుదిరినా... సిట్టింగులకు ఢోకా ఉండదనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఈ స్థానాల్లోని కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకుల రాజకీయ భవిష్యత్ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.
         
    టీఆర్‌ఎస్ ప్రాతినిథ్యం వహిస్తున్న మూడు అసెంబ్లీ స్థానాలను మినహాయిస్తే... జనగామ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సిట్టింగులకు ఇబ్బందులు లేని సూత్రంతో విలీనం లేదా పొత్తు... జరిగితే ఈ ఎమ్మెల్యేలకు ఇబ్బంది ఉండకపోవచ్చు.
         
    కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైనా, పొత్తు కుదిరినా... టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించే అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలోనే ఎక్కువ సమస్యలు రానున్నాయి. ముఖ్యంగా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో సర్దుబాటు ఇబ్బందులు తప్పేలాలేవు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి ఈ సెగ్మెంట్‌లో ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. సుదీర్ఘకాలం టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుతం జిల్లా కన్వీనర్‌గా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. విలీనమైతే రెండు వర్గాలు... పొత్తు కుదిరితే రెండు పార్టీలు ఈ సీటు కోసమే పోరు సాగించే పరిస్థితి కనిపిస్తోంది.
         
    పాలకుర్తి నియోజకవర్గంలోనూ నర్సంపేట పరిస్థితే ఉండనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే ఎన్.సుధాకర్‌రావు కొనసాగుతున్నారు. సీటు కోసం ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నించే వారే కావడంతో సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
         
    ములుగు నియోజకవర్గ టికెట్ ఎవరికి దక్కుతుంతో చివరి వరకు ఉత్కంట పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నారుు.  గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన పోదెం వీరయ్య కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ మంత్రి ఎ.చందులాల్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. రెండు పార్టీలు కలిస్తే సీటు ఎవరికి దక్కుతుందనేది అంతుపట్టకుండా ఉంది.
         
    డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి డీఎస్.రెడ్యానాయక్‌కు దీటైన నేతలు టీఆర్‌ఎస్‌లో లేకపోవడంతో  సీటు కాంగ్రెస్ పార్టీకే దక్కే పరిస్థితి ఉంది.
         
    టీఆర్‌ఎస్, కాంగ్రెస్ భవిష్యత్ పయనం ప్రభావం వరంగల్ లోక్‌సభ స్థానంపై ఎక్కువగా పడనుంది. ప్రస్తుతం  కాంగ్రెస్‌కు చెందిన సిరిసిల్ల రాజయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి టీఆర్‌ఎస్ తరఫున వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారని గులాబీ అధినేత కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. కడియం... టీఆర్‌ఎస్‌లో చేరిన రోజే ఈ విషయం చెప్పారు.
     
    దీన్నిబట్టి టీఆర్‌ఎస్ తమ కోసం బలంగా పట్టుబట్టే లోక్‌సభ స్థానాల్లో వరంగల్ ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీహరికి ఈ సీటు దక్కితే సిట్టింగ్ ఎంపీ రాజయ్య పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
     
     

Advertisement

తప్పక చదవండి

Advertisement