ఇప్పుడే విజయవాడా.. సారీ | Sakshi
Sakshi News home page

ఇప్పుడే విజయవాడా.. సారీ

Published Tue, Oct 7 2014 1:04 AM

ఇప్పుడే విజయవాడా.. సారీ

 హైదరాబాద్‌ను వీడమంటున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కార్యాలయాల తరలింపుపై కమిటీకి తేల్చి చెబుతున్న వైనం
 
మార్చి వరకు ఇక్కడే ఉంటాం..
 విద్యా సంవత్సరం మధ్యలో వెళ్తే ఇబ్బంది అంటున్న ఉద్యోగులు
ఈ నెలాఖరుకు అగ్నిమాపక శాఖ తరలింపు

 
హైదరాబాద్: సాధ్యమైనంత త్వరలో ముఖ్యమైన ప్రభుత్వ విభాగాలను విజయవాడకు తరలించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. వచ్చే ఏడాది మార్చి వరకు హైదరాబాద్‌ను వీడబోమని ఉద్యోగులు తేల్చి చెబుతున్నట్లు తెలిసింది. విద్యా సంవత్సరం మధ్యలో హడావుడిగా హైదరాబాద్‌ను వదిలి విజయవాడ వెళ్లాలంటే కుటుంబపరంగా ఇబ్బందులుంటాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని కార్యాలయాల తరలింపుపై ముఖ్య కార్యదర్శులతో ఏర్పాటైన కమిటీ చేపట్టిన అభిప్రాయసేకరణలో వారు ఈమేరకు స్పష్టంగా చెబుతున్నారు. బహిరంగ సభల్లో సీఎం ప్రకటించినంత తేలికగా తరలింపు ఉండదని, కార్యాలయాల ఏర్పాటుకు ఓ రూపు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ విభాగాలు పనిచేయడం కష్టమని కమిటీకి ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. కనీసం ఆరు నెలలు గడువిస్తే ఫైళ్ళ సర్దుబాటు, కంప్యూటరీకరణ తదితర అంశాలన్నీ పూర్తి చేస్తామని, ఈలోగా విద్యా సంవత్సరం ముగుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో ఏర్పాైటైన కమిటీకి విధివిధానాల రూపకల్పనలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్యాంబాబ్, ఆదిత్యనాథ్ దాస్, అజయ్ కల్లాం, సాంబశివరావు, జవహర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నీలం సహానీలతో కూడిన ఈ కమిటీ ఈనెల 13వ తేదీకల్లా విధివిధానాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. దీంతో ఈనెల 6వ తేదీకల్లా వాటిని రూపొందించాలని నిర్ణయించింది. తొలి దశలో ఆరు శాఖలను తరలించేలా ప్రణాళిక తయారు చేయాలని నిర్ణయించింది. హోం, విద్య, వైద్య, వ్యవసాయ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల విభాగాధిపతులు తొలి దశలో విజయవాడ నుంచి పనిచేసేలా నిర్ణయం తీసుకుంది. వీటిలోనూ హోం, విద్య, ఇరిగేషన్ శాఖల కార్యాలయాలను వీలైనంత త్వరగా తరలించాలని భావిస్తోంది.  ఒక్క హోం శాఖకు అవసరమైన స్థలం, భవనాల నిర్మాణాలపై మాత్రమే ఇప్పటివరకు స్పష్టత వచ్చింది. మిగిలిన శాఖలకు ఎంత స్థలం అవసరమన్న విషయం తేలలేదు. హోం శాఖకు కోటి చదరపు అడుగులు అవసరమని కమిటీకి నివేదిక అందింది. ఈ శాఖ కార్యాలయాల ఏర్పాటుకు గన్నవరంలోని మేధా టవర్స్, విజయవాడ బందరు రోడ్డులోని లైలా కాంప్లెక్స్‌లు అనువుగా లేవు. దీంతో ఈ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

 ఒక్క అగ్నిమాపక శాఖ మాత్రం ఈ నెలాఖరులో విజయవాడ నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర విభజనకు ముందే అగ్నిమాపక శాఖ విజయవాడ నగరంలో ఓ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. మిగతా శాఖల తరలింపులో అనేక అభ్యంతరాలు వస్తున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement